సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎమ్మెల్యేలు,మంత్రులు ఇలా ఏ ఒక్కరి ఫోన్లు వదలడం లేదు. లేటెస్ట్ గా పలువురు తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్ లతో పాటు పలువురి వాట్సాప్ లు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంక్ ఆధార్ అప్డేట్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ ను షేర్ చేస్తున్నారు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తు ఎస్బీఐ పేరుతో మెస్సేజ్ లు చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
సైబర్ మోసగాళ్లు రూట్ మార్చారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరిగి ఓటీపీలు చెప్పకుండా జాగ్రత్త పడుతుండటంతో ఏకంగా మొబైల్ ఫోన్లనే హ్యాక్ చేస్తున్నారు. ఇందుకోసం ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైళ్ల రూపంలో మాల్‌వేర్‌ను పంపి సెల్‌ఫోన్లలోకి చొరబడుతున్నారు. ఆ తరువాత మొబైల్ ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుని బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు
ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయొద్దు..
సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్(.apk) లింకులను ఎట్టి పరిస్థితిలోనూ క్లిక్ చేయొద్దు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ లోనూ కొన్ని యాప్ లు స్కామర్లు సృష్టించినవి ఉంటాయి. స్మార్ట్ ఫోన్‌లోని సెట్టింగ్‌లో ఇన్‌స్టాల్ ఫ్రం అన్‌నోన్ సోర్సెస్(తెలియని వెబ్ సైట్ల నుంచి) అనే ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవాలి. దీంతో మన అనుమతి లేకుండా యాప్స్ ఇన్‌స్టాల్ కావు. ఏపీకే ఫైల్, మాల్‌వేర్ ఇన్‌స్టాల్ జరిగినట్లు అనుమానం వస్తే మొబైల్ రీసెట్ చేయాలి. ఆ వెంటనే బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన పిన్ నంబర్లు, పాస్‌వర్డులు మార్చుకోవాలి. M KAVACH2 యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని స్కాన్ చేస్తే మొబైల్ డివైజ్ సెక్యూర్‌గా ఉంటుంది.
వెంటనే 1930కి కాల్ చేయాలి..
ఏపీకే ఫైళ్లతో పాటు సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే లింకులు ఓపెన్ చేస్తే.. ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్తుంది. ఏపీకే వంటి యాప్‌లను ఇన్ స్టాల్ చేస్తే.. ఓటీపీలు చెప్పకున్నా అకౌంట్లు ఖాళీ చేస్తారు. సైబర్ క్రిమినల్స్ బారిన పడిన బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. లేదా http://cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.
