- పొత్తుల కోసం సీపీఐ నేతలతో భేటీ.. ఇంకా తేలని నిర్ణయం
- తమ్మినేనిని మద్దతు కోరిన బీఆర్ఎస్.. కొనసాగుతున్న చర్చలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికల బరిలో నిలిచేందుకు కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నారు. వచ్చే మార్చిలో మహబూబ్‌నగర్-–రంగారెడ్డి–-హైదరాబాద్, వరంగల్-–ఖమ్మం-–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఖరారు చేయగా.. రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఎం కసరత్తు ముమ్మరం చేసింది.
రెండు స్థానాల్లో పోటీకి సీపీఎం కసరత్తు ముమ్మరం చేసింది. వామపక్షాల ఐక్యత కోసం సీపీఎం రాష్ట్ర బృందం సీపీఐ నాయకత్వంతో భేటీ అయి చర్చలు జరిపింది. అయితే, పొత్తుపై సీపీఐ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. మరోవైపు, తమకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ సీపీఎంను కోరింది. ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
లెఫ్ట్ పార్టీల మధ్య చర్చలు.. త్వరలో కొలిక్కి..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి లెఫ్ట్ పార్టీల మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. దీనిపై త్వరలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేద్దామని సీపీఎం ప్రతిపాదించగా.., సీపీఐ రాష్ట్ర నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌తో ఉన్న రాజకీయ సమీకరణాలు, భవిష్యత్ వ్యూహాలను కూడా సీపీఐ బేరీజు వేసుకుంటోంది. మరోవైపు సీపీఐ కలిసి వచ్చినా.. రాకపోయినా తాము మాత్రం ఏదో ఒక స్థానం నుంచి కచ్చితంగా బరిలో నిలవాల్సిందేనని సీపీఎం గట్టి పట్టుదలతో ఉంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. రెండుస్థానాల్లో ఏదోఒక చోట నుంచి బరిలో నిలవాలని భావిస్తోంది. కాగా, సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీచేసి గెలుపొందింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ సీపీఐకి ఒక ఎమ్మెల్సీ సీటు కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో వారు వామపక్షాలతో కలిసి నడుస్తారా..? లేక కాంగ్రెస్‌తో కలిసి పయనం చేస్తారా..? అనేది ఇంకా స్పష్టత రాలేదు. సీపీఐ కలిసొచ్చేనా.. రాకపోయినా ఇతర వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సీపీఎం హస్తశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది.
సీపీఎంతో బీఆర్ఎస్ చర్చలు..
ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు సీపీఎం నేతల ముందు ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీలను నిలువరించేందుకు రెండు స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని తమ్మినేని వీరభద్రం కోరినట్లు తెలిసింది. ఈ మేరకు బీఆర్ఎస్, సీపీఎం నేతల మధ్య తెరవెనుక సమాలోచనలు జరుగుతున్నాయి. అయితే, సీపీఎం మాత్రం కచ్చితంగా ఒకసీటు నుంచి పోటీ చేస్తామని తేల్చిచెప్పడంతో బీఆర్ఎస్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేదానిపై మదనం చేస్తున్నది. ఒకవేళ బీఆర్ఎస్ ఒక సీటు తమకు కేటాయిస్తే.. వారి మద్దతుతో బరిలోకి దిగితే ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై సీపీఎం అంతర్గతంగా లెక్కలు వేసుకుంటోంది. అయితే, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో సీపీఎంకు క్యాడర్‌తోపాటు పార్టీకి పట్టు ఉంది. దీంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంపైనే గురిపెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు, సీపీఎం నుంచి బరిలో నిలిచేందుకు దాదాపు ఐదుగురు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.
నాడు రెండుసార్లు నాగేశ్వర్ విక్టరీ..
గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలకు ట్రాక్ రికార్డు ఉంది. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ నుంచి ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు సీపీఎం, వామపక్ష ప్రజాసంఘాల మద్దతుతో వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా గెలుపొందారు. మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, వామపక్షాలు, పీడీఎఫ్ (ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్), ఉద్యోగ, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతునిచ్చి కాంగ్రెస్ అభ్యర్థిపై ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాయి. రెండోసారి ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లోనూ వామపక్షాల సపోర్ట్‌తో ప్రొఫెసర్ నాగేశ్వర్ రెండోసారి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై భారీ ఓట్ల తేడాతో గెలిచి 2015 వరకు మండలిలో ప్రజా, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై గళమెత్తారు. కాగా, మండలిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగుల గొంతుకను బలంగా వినిపించిన చరిత్ర వామపక్షాలకు ఉందని, ఆ నాటి విజయాలను పునరావృతం చేయాలనే లక్ష్యంతోనే ప్రస్తుత ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని సీపీఎం కృతనిశ్చయంతో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్‌రోల్‌మెంట్ ముగిసిన తర్వాత అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై పూర్తి స్పష్టత రానుంది.
