- రుణమాఫీపై బీఆర్‌ఎస్ విమర్శలకు కౌంటర్
హైదరాబాద్, వెలుగు: చిన్న వయస్సున్న రాష్ట్రమైనప్పటికీ సాహసోపేత నిర్ణయాలతో తెలంగాణ పెద్ద రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యంగా రైతుల పక్షపాతిగా నిలిచి ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి పంటకాలంలోనే రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నామని తెలిపారు. పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికల ప్రకారం దేశంలోనే తెలంగాణ రైతుల పంట రుణబాకీలు తక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూ.20,616.89 కోట్ల రుణమాఫీ అమలు చేయడంతో 25,35,964 మంది రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పారు. రుణమాఫీలో పారదర్శకతకు బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి అర్హులైన ప్రతి రైతుకూ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
