మే చివర్లో లేదా జూన్ ఫస్ట్ వీక్ లో పరిషత్ ఎన్నికలు

మే చివర్లో లేదా జూన్ ఫస్ట్ వీక్ లో పరిషత్ ఎన్నికలు
  • సీఎం రేవంత్ నుంచి పీసీసీకి సంకేతాలు
  •     క్యాడర్ ను సిద్ధం చేసేందుకు జిల్లాల పర్యటనల్లో పీసీసీ చీఫ్​ బిజీ, బిజీ 
  •     జనంలో ఉంటూ లోకల్ అంశాలపై ఫోకస్ పెట్టే వారికే టికెట్లు అని స్పష్టం
  •     కాంగ్రెస్ క్యాడర్​లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల హడావుడి 

హైదరాబాద్, వెలుగు:   మే నెల చివర్లో లేదా జూన్ మొదటి వారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్ లో మంచి ఫలితాలతో కాంగ్రెస్ ఊపు మీద ఉండడంతో.. పనిలో పనిగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండడంతో ప్రభుత్వం ఎన్నికల జోలికి వెళ్లలేదు. పైగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా పూర్తి కానున్నందున మే చివర్లో లేదా జూన్ మొదటి వారంలో అయితే పరిషత్తు ఎన్నికలకు పూర్తి అనుకూలంగా ఉంటుందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసినట్లు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. 

ఈ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కు స్పష్టమైన సంకేతాలు అందడంతో పరిషత్తు ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేసే పనిలో ఆయన బీజీ, బీజీగాఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ నాయకులను సమాయత్తం చేయడంలో భాగంగా గత వారం రోజులుగా మహేశ్ గౌడ్ వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్లు ఆశించే నాయకులు ఇప్పటి నుంచే జనంలో తిరగాలని, పైరవీలతో టికెట్లు రావని, లోకల్ సమస్యలను ప్రస్తావిస్తూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. 

80 శాతం స్థానాలు గెలవడమే లక్ష్యంగా.. 

ప్రతి ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే నాయకులకు టికెట్లు ఇస్తున్నామని, ఈ ఎన్నికల్లో కూడా సర్వేల ప్రకారం జనంలో ఎవరికి ఆదరణ ఉంటుందో వారికే పార్టీ టికెట్లు కేటాయిస్తామని మహేశ్ గౌడ్ తన జిల్లాల పర్యటనలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతానికి పైగా జిల్లా, మండల పరిషత్తులను కాంగ్రెస్ గెలుచుకోవడమే లక్ష్యంగా డీసీసీ చీఫ్ లకు, ఆయా జిల్లాల మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలకు పీసీసీ చీఫ్ పలు సూచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితి, నేతల మధ్య కొరవడ్డ సమన్వయం, పాత, కొత్త నేతల మధ్య ఉన్న విబేధాలపై కూడా ఆయన దృష్టిపెడుతూ, వాటిని పరిష్కరించే పనిలో ఉన్నారు. 

బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటివరకు డీసీసీ చీఫ్ లు ఎలాంటి  చర్యలు తీసుకున్నారు, పార్టీ ఇచ్చిన కార్యక్రమాల అమలు ఏ స్థాయిలో ఉందనే వాటిపై కూడా జిల్లాల టూర్లో మహేశ్ గౌడ్ సమీక్షలు చేస్తున్నారు. స్వయంగా పీసీసీ చీఫ్ జిల్లాల్లో పర్యటిస్తూ కొత్తగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులతో ఇటు ప్రమాణ స్వీకారం చేయిస్తూనే ఇంకో వైపు రాబోయే పరిషత్తు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి కనిపిస్తోంది.