
- సంగారెడ్డి జిల్లా రుద్రారంలో
- రెండు యూనిట్లు ప్రారంభం..మరోదానికి భూమి పూజ
- కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామి
- ఇప్పటికే క్లీన్ ఎనర్జీలో 29 వేల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్‌బాబు
- తయారీ రంగంలో తెలంగాణ దిక్సూచి: వివేక్ వెంకటస్వామి
సంగారెడ్డి, వెలుగు: జపాన్ దిగ్గజ సంస్థ తోషిబా కొత్త యూనిట్‌కు శుక్రవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భూమిపూజ చేశారు. ఇప్పటికే పూర్తయిన రెండు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను వారు ప్రారంభించారు. రాష్ట్రంలో కంపెనీ విస్తరణలో భాగంగా తోషిబా రూ. 562 కోట్లతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారంలో మూడు యూనిట్లను చేపడ్తున్నది.
ఇందులో రెండు యూనిట్లు పూర్తయ్యాయి. మరో యూనిట్ పనులు ప్రారంభమయ్యాయి. భూమిపూజ కార్యక్రమం అనంతరం పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడారు.
పెట్టుబడులకు కరెక్ట్ ప్లేస్ తెలంగాణ
పెట్టుబడులకు తెలంగాణ సరైన ప్రాంతమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. యంగ్ ఇండియా పాలసీ యువత భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని, యువతకు నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ ప్రోత్సాహం, ఆధునిక టెక్నాలజీ పరిజ్ఞానం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. తెలంగాణను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని వివరించారు.
2024–-25లో ఇండస్ట్రియల్ అవుట్‌పుట్ రూ.2.77 లక్షల కోట్లు ఉండగా, ఇందులో 48 శాతం వాటా తయారీ రంగానిదేనని మంత్రి శ్రీధర్ చెప్పారు. 9 నెలల్లోనే రూ. లక్ష కోట్ల విలు వైన మార్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ రాష్ట్రం నుంచి జరుగగా, జాతీయ సగటు కన్నా ఎక్కువగా జీఎస్డీపీ వృద్ధి రేటు 8.2 శాతం సాధించినట్టు వివరించారు. తెలంగాణను రెన్యువబుల్స్ ఇంజిన్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే సంకల్పంతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ -– 2025 తీసుకొచ్చామన్నారు.
ఇప్పటికే క్లీన్ ఎనర్జీలో రూ. 29 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామన్నారు. 2030 నాటికి న్యూ రెన్యువబుల్ కెపాసిటీని 20 వేల మెగావాట్లకు పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రుద్రారం రైసింగ్ కారిడార్ గా మారుతుందని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ సెక్టర్ కు ప్రోత్సాహం అందిస్తున్నామని, విద్యుత్ డిమాండ్ కు తగ్గట్టు విద్యుత్ పరికరాల తయారీ కంపెనీలు ఉండాలని ఆకాంక్షించామని చెప్పారు.
రుద్రారంలోని తోషిబా ఈ విషయంలో ముందువరసలో ఉందన్నారు. స్కిల్ ఇండియా యూనివర్సిటీ, డీట్ లాంటి నూతన ఉద్యోగ, ఉపాధి కేంద్రాలను ప్రారంభించామన్నారు. తోషిబా కంపెనీ జపాన్ బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్ గా వస్తువులు తయారీ చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
మరిన్ని పెట్టుబడులు వస్తాయి: వివేక్
రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం అమలవుతున్నదని కార్మిక, గనుల శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పరిశ్రమల్లో నూతన ఉద్యోగాల కల్పన ద్వారా కార్మికుల జీవితాల్లో వెలుగులు పంచాలన్నదే తన సంకల్పమని తెలిపారు. తోషిబాలో ఆధునిక టెక్నాలజీని వాడడం ద్వారా కార్మికులకు శ్రమ తగ్గుతుందన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. అనతికాలంలోనే తయారీ రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కృషి, పట్టుదల కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కార్యక్రమంలో ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, జపాన్ ఎంబసీ ఎకనామిక్, డెవలప్మెంట్ మంత్రి క్యూకో హోకోగో, తోషిబా కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ హిరోషి కనేట, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం తుల్జానాయక్ తోషిబా పరిశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.