కొత్త పురపాలక చట్టానికి గవర్నర్‌ అభ్యంతరం

కొత్త పురపాలక చట్టానికి గవర్నర్‌ అభ్యంతరం

తెలంగాణ నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్‌ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిల్లుకు ఆయన ఆమోదం లభించలేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆయన నో చెప్పడంతో ..గవర్నర్‌ సూచించిన అంశాలతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. కొత్త పురపాలక చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ, మండలి ఆమోదం కూడా పొందింది. వాస్తవానికి ఆ మరుసటి రోజే గవర్నర్‌ ఆమోదం పొంది కొత్త చట్టం అమల్లోకి రావాల్సి ఉంది.

ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్థాయి అధికారాలు ఉండటం పట్ల నరసింహన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బిల్లుకు ఆయన మరికొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గవర్నర్‌ సూచించిన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది.