
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. హైదరాబాద్ ఒలింపిక్ భవన్‌లో జరిగిన పోలింగ్‌లో 65 మంది ఓటర్లలో 59 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రెసిడెంట్ పోస్టుకు జితేందర్ రెడ్డి, చాముండేశ్వర్ నాథ్ పోటీ పడ్డారు. దీంతో పాటు జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టుకు మాత్రమే పోలింగ్ జరగ్గా.. మిగతా పదవులకు ఒక్కో అభ్యర్థి మాత్రమే పోటీలో నిలిచారు. ఈ ఎన్నికలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) డీడీ చంద్రారెడ్డి అబ్జర్వర్‌గా హాజరయ్యారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్‌ను పంపించలేదు. ఎన్నికల ఫలితాల ప్రకటనపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్టే ఉండడంతో కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేశారు.