
దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘ట్వల్త్ ఫెయిల్’ నిలవగా, ఉత్తమ నటుడి అవార్డును షారుఖ్ ఖాన్, విక్రాంత్ మస్సే పంచుకున్నారు. రాణీ ముఖర్జీ ఉత్తమ నటిగా నిలిచారు.
తెలుగు సినిమాలకు ఏడు కేటగిరీస్‌లో అవార్డులు లభించాయి. బలగం, భగవంత్ కేసరి, హనుమాన్, బేబీ, గాంధీ తాత చెట్టు చిత్రాలు అవార్డులను గెలుచుకున్నాయి. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కాసర్ల శ్యామ్ రాసిన ‘ఊరు పల్లెటూరు’ పాటకు ఉత్తమ గీతరచయితగా ఎంపికవడం తెలంగాణ పల్లె పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.
‘భగవంత్ కేసరి’ సందేశానికి జై కొడుతూ.. నేషనల్ అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాల హవా కనిపించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’కి అవార్డు దక్కింది. ఆడ పిల్లను ఆడ పులిలా పెంచాలనే సందేశానికి, కమర్షియల్ అంశాలు జోడిస్తూ అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. బాలకృష్ణ పెంపుడు కూతురుగా శ్రీలీల నటించింది. మంచి సందేశానికి జై కొడుతూ ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు వరించింది.
టెక్నికల్‌గా హై.. ‘హనుమాన్’
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ నేషనల్ లెవల్‌లో పెద్ద సక్సెస్‌ను సాధించింది. జాతీయ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో సత్తా చాటింది. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ), ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులకు ఎంపికైంది.
‘బేబీ’ స్క్రీన్‌ప్లేకు
సంచలన విజయాన్ని అందుకున్న ‘బేబీ’ చిత్రం రెండు కేటగిరీస్‌లో మెప్పించింది. బెస్ట్ స్క్రీన్‌ప్లేకు గాను దర్శకుడు సాయి రాజేష్, బెస్ట్ మేల్ సింగర్‌గా పీవీఎస్‌ఎన్ రోహిత్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కూతురు
దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి జాతీయ స్థాయిలో బాలనటిగా ఎంపికైంది. ‘గాంధీతాత చెట్టు’ చిత్రంతో ఆమె ఉత్తమ బాల నటిగా నిలిచింది. అలాగే హిందీ చిత్రం ‘యానిమల్’ నేపథ్య సంగీతానికి గాను తెలుగు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు.
ఊరు తీరును చెప్పిన శ్యామ్ పాట
ఇటీవల ‘గద్దర్’ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘బలగం’ సినిమా ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ మెప్పించింది. తెలంగాణ పల్లె వాతావరణం, అనుబంధాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ‘ఊరు పల్లెటూరు’ అంటూ పాట రాసిన కాసర్ల శ్యామ్ ను ఉత్తమ గేయ రచయితగా అవార్డు వరించింది. భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు సంగీతం సమకూర్చగా రామ్ మిరియాల పాడారు. తెలంగాణ గ్రామీణ ప్రజల రోజువారి జీవితం మొదలు.. ఆటపాటలు, సంస్కృతి , సంప్రదాయాలు, అనుబంధాలు, ఆప్యాయతలను హృదయాలకు హత్తుకునేలా శ్యామ్ ఈ పాటకు లిరిక్స్ రాశారు.
తెలుగు పాటకు ఐదవ జాతీయ అవార్డ్
ఉత్తమ గీత రచయిత కేటగిరీలో తెలుగు సినిమాకు అవార్డు రావడం ఇది ఐదవసారి. 1974లో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలోని ‘తెలుగువీర లేవరా’ పాటకుగాను శ్రీశ్రీ, 1994లో ‘మాతృదేవోభవ’ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..’ పాటకు వేటూరి సుందరరామ్మూర్తి, 2003లో ‘ఠాగూర్’ చిత్రంలోని ‘నేను సైతం’ పాటకు సుద్దాల అశోక్ తేజ, 2021లో వచ్చిన ‘కొండపొలం’ చిత్రంలోని ‘ధం ధం ధం’ పాటకు గాను చంద్రబోస్ జాతీయ అవార్డులను అందుకున్నారు.
హిందీ సినిమాలకు అవార్డుల పంట
‘జవాన్’ సినిమాకు గాను షారుఖ్‌కు, ‘ట్వల్త్ ఫెయిల్’ చిత్రానికి గాను విక్రాంత్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఉత్తమ చిత్రం అవార్డును కూడా ‘ట్వల్త్ ఫెయిల్’ గెలుచుకోవడం విశేషం. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ‘మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’కు గాను రాణీ ముఖర్జీ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.
ఇక వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’కి గాను ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ ఎంపికయ్యారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ నిలిచింది. ఈసారి ప్రాధాన్యత గల కేటగిరీ అవార్డులన్నీ హిందీ సినిమాలకే దక్కడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
విజేతలు వీరే..
- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ : 12th ఫెయిల్ (హిందీ)
- బెస్ట్ పాపులర్ ఫిల్మ్ : రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ (హిందీ)
- ఉత్తమ నటుడు : షారుక్ ఖాన్ (జవాన్) హిందీ,
- విక్రాంత్ మస్సే ( 12th ఫెయిల్) హిందీ
- ఉత్తమ నటి : రాణీ ముఖర్జీ
- (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) హిందీ
- ఉత్తమ సహాయ నటుడు : విజయ రాఘవన్ (పూక్కాలం) మలయాళం, ముత్తు పెట్టాయ్
- సోము భాస్కర్ (పార్కింగ్) తమిళం
- ఉత్తమ సహాయ నటి : ఊర్వశి (ఊళ్ళోలుక్కు) మలయాళం, జానకీ బోడివాలా (వశ్) గుజరాతీ
- బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ : సుకృతి వేణి (గాంధీతాత చెట్టు) తెలుగు, కబీర్ ఖండారీ (జిప్సీ) మరాఠీ, త్రిష థోసర్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్దీప్ (నాల్ 2) మరాఠీ
- బెస్ట్ డైరెక్టర్ : సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ) హిందీ
- బెస్ట్ సినిమాటోగ్రాఫర్ :
- పసంతను మొహపాత్రో (ది కేరళ స్టోరీ) హిందీ
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : మోహన్ దాస్ (2018) మలయాళం
- బెస్ట్ స్ర్కీన్‌ప్లే (ఒరిజినల్) : సాయి రాజేష్
- (బేబీ) తెలుగు, రామ్ కుమార్ (పార్కింగ్) తమిళ
- బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాష్ కుమార్ (వాతి) తమిళ
- బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్) హిందీ
- బెస్ట్ ఎడిటింగ్ : మిధున్ మురళి
- (పూక్కాలమ్) మలయాళం
- బెస్ట్ డైలాగ్స్ : దీపక్ కింగ్రానీ
- (సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై) హిందీ
- బెస్ట్ లిరిసిస్ట్ : కాసర్ల శ్యామ్
- (ఊరు పల్లెటూరు) బలగం, తెలుగు
- బెస్ట్ ప్లే బ్యాక్ సింగ్ (మేల్) :
- పీవీఎస్ఎన్ రోహిత్ (ప్రేమిస్తున్నా..) బేబీ
- బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్) :
- శిల్పారావు (చెలియా) జవాన్
- బెస్ట్ సౌండ్ డిజైన్ : సచిన్ సుధాకరన్,
- హరి హరన్ మురళీ ధరన్ (యానిమల్) హిందీ
- బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ : వైభవ్ మర్చంట్
- ( రాకీ ఔర్ రాణికీ ప్రేమ కహానీ) హిందీ
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : సచిన్ లవ్లేకర్,
- దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్) హిందీ
- బెస్ట్ మేకప్: శ్రీకాంత్ దేశాయ్ (సామ్ బహదూర్) హిందీ
- బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: నందు, పృథ్వీ (హనుమాన్)
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: హనుమాన్ (తెలుగు)
- బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: ఆశిష్ బెండే (ఆత్మపాంప్లెట్) మరాఠీ)
- బెస్ట్ చైల్డ్ ఫిల్మ్: నాల్ (మరాఠీ)
- స్పెషల్ మెన్షన్: ఎంఆర్ రాజకృష్ణన్
- (యానిమల్) రీ రికార్డింగ్
- ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలు
- తెలుగు: భగవంత్ కేసరి
- తమిళం: పార్కింగ్
- కన్నడ: కందీలు–ఇ రే ఆఫ్ హోప్
- మలయాళ: ఉళ్ళోలుక్కు
- హిందీ: కథల్ : ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ
- పంజాబీ: గాడ్‌డే గాడ్‌డే చా
- గుజరాతీ: వశ్
- ఒడియా: పుష్కర
- మరాఠీ: షామ్‌చియామ్
- బెంగాలీ: డీప్ ఫ్రీడ్జ్
- అస్సామీ: రొంగటపు 1982
ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ ఎంపికవడం నాకు అపారమైన గర్వకారణం. ఈ గౌరవం మొత్తం మా చిత్ర బృందానికే చెందుతుంది. అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. మా నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావడానికి ఈ గుర్తింపు స్ఫూర్తినిస్తుంది. - బాలకృష్ణ
నా కెరీర్‌లోనే స్పెషల్ ఫిల్మ్. నేను అటెంప్ట్ చేసిన డిఫరెంట్ సినిమా ‘భగవంత్ కేసరి’. ‘బనావో బేటి కో షేర్’ లాంటి మంచి సందేశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాం. అవార్డు రావడంతో పాటు ఆడవారిలో ఈ సినిమా స్ఫూర్తిని నింపడం అచీవ్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నాం.
- అనిల్ రావిపూడి
జాతీయ అవార్డు రావడం మా షైన్ స్ర్కీన్స్ బ్యానర్‌కు మరింత బాధ్యతను పెంచింది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తాం.
- సాహు గారపాటి
తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పల్లె స్వచ్ఛతను చాటిచెప్పిన ఈ పాట జాతీయ స్థాయిలో నాకు గుర్తింపును తెచ్చిపెట్టడం తెలుగు వాడిగా గర్వపడుతున్నాను. ఎందరో మహానుభావుల తర్వాత నాకు ఈ అవార్డు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందుకు కారణమైన చిత్ర దర్శకనిర్మాతలు, సంగీత దర్శకుడు సింగర్స్‌కు థ్యాంక్స్.
కాసర్ల శ్యామ్