పల్లె ఫలితాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం... సంక్షేమ పథకాలే గెలిపించాయి: మహేశ్ గౌడ్

పల్లె ఫలితాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం... సంక్షేమ పథకాలే గెలిపించాయి: మహేశ్ గౌడ్
  • మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతోనే సక్సెస్ అయ్యామని వెల్లడి

 హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్  మద్దతుదారులే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్  కుమార్  గౌడ్  ఆదివారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పుకు సంకేతమని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనపై జనం ఉంచిన నమ్మకానికి నిదర్శనమని ఆయన  పేర్కొన్నారు. 

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలను ఒకే వేదికపై సమన్వయం చేసుకుంటూ.. క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసిన ప్రచార వ్యూహాలే పార్టీని గెలిపించాయన్నారు. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, పల్లె జనం ఇచ్చిన ఈ తీర్పుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. గత రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు చేరడం వల్లే ఈ సానుకూల ఫలితాలు వచ్చాయని విశ్లేషించారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, రైతులు ఏకపక్షంగా కాంగ్రెస్  వైపే నిలిచారని, సామాజిక న్యాయం అనే నినాదానికి పట్టం కట్టారని పేర్కొన్నారు. 

సీఎం, మంత్రులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండటం కూడా కలిసొచ్చిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేందుకు, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.