సీనియర్లకు కాదు.. సత్తా ఉన్నవారికే పీసీసీ పదవి

సీనియర్లకు కాదు.. సత్తా ఉన్నవారికే పీసీసీ పదవి

కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన ఇదే..

ఏఐసీసీ అధ్యక్ష పదవి, పార్టీ కమిటీ నియామకం తర్వాతే భర్తీ
పోటీ పడుతున్న కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ పీసీసీ చీఫ్​ ఎంపిక మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఏఐసీసీ ప్రక్షాళన తర్వాతే రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయి. గ్రేటర్​హైదరాబాద్​, గ్రేటర్​వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు మినహా రాష్ట్రంలో అన్ని ఎలక్షన్లు అయిపోయాయి. దీంతో పీసీసీ చీఫ్​ నియామకం విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదనే యోచనలో ఏఐసీసీ ఉందని సమాచారం. ఏఐసీసీ అధ్యక్ష పదవి సహా పార్టీ కమిటీని నియమించిన తర్వాతే రాష్ట్రాల చీఫ్​లను నియమించాలని​ హైకమాండ్ భావిస్తోంది. మరోవైపు మార్చి 2 నుంచి ఏప్రిల్​ 3 వరకు పార్లమెంట్​ సమావేశాలు జరగనున్నాయి. ఆ తర్వాతే ఏఐసీసీ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని తెలిసింది.

అందుకోసమే ఆలస్యమా?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంపై ఆశలు పెట్టకున్న కాంగ్రెస్​కు ఫలితాలు తీవ్ర నిరాశ పరిచాయి. లోక్​సభ. గ్రామపంచాయతీ, పరిషత్​, మున్సిపల్​ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​కు ఓటమి తప్పలేదు. కాంగ్రెస్​ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్​లో చేరారు. పలువురు ఎమ్మెల్సీలు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్​ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో టీఆర్​ఎస్​ కండువా కప్పుకున్నారు. తనను తెలంగాణ పీసీసీ చీఫ్​ పోస్టు నుంచి తొలగించాలని ప్రస్తుత అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్​కుమార్​రెడ్డి పార్టీ హైకమాండ్​కు లెటర్​రాశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే నాయకత్వం అవసరమని కాంగ్రెస్​ హైకమాండ్​ఆలోచిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్​గా  పార్టీని గెలిపించే లీడర్​ కోసం చూస్తున్నది. కాబట్టి నియామకం విషయంలో తొందరపడాల్సిన అవసరంలేదని భావిస్తోంది.

రేస్‌లో రేవంత్, కోమటిరెడ్డి

పీసీసీ చీఫ్ పోస్టు కోసం పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పీసీసీ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్
ఎ. రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు. అయితే పీసీసీ అధ్యక్ష పదవి నియామకం విషయంలో పార్టీలోని కొత్త, పాత నేతలు రెండు వర్గాలుగా విడిపోయినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో మొదటి నుంచి
ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని కొంతమంది హైకమాండ్‌ను కోరుతుండగా, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడు ఎవరున్నారో గుర్తించి వారికే ఇవ్వాలని, మిగిలిన విషయాలను పట్టించుకోవద్దని ఇతర నేతలు అంటున్నారు.

For More News..

యూత్‌కు ఉపాధి కోసం ‘కేసీఆర్ ఆపద్బంధు’

రూ. 50 ఇయ్యలేదని చిన్నారి ఆత్మహత్య

మహిళలకోసం మహిళా వైన్ షాపులు