కల్వకుంట్ల ఫ్యామిలీని .. జనం అసహ్యించుకుంటున్నరు : లక్ష్మణ్

కల్వకుంట్ల ఫ్యామిలీని .. జనం అసహ్యించుకుంటున్నరు  : లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ హాజరైన పాలమూరు ప్రజాగర్జన మీటింగ్ సక్సెస్ కావడంతో కల్వకుంట్ల కుటుంబం గాయిగత్తర అవుతోందని ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీలక్ష్మణ్ విమర్శించారు. ప్రధాన మంత్రి పదవికి గౌరవం ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని అసహ్యించుకుంటున్నారని చెప్పారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘బీరు, బిర్యానీ కోసం కాకుండా ప్రజలు మోదీ ప్రసంగం వినేందు కోసం వచ్చి పాలమూరు సభను విజయవంతం చేశారు. 

దీంతో దిక్కుతోచక కల్వకుంట్ల కుటుంబం బిత్తరయిపోయి గాయిగత్తర చేస్తున్నది. వాళ్ల కాళ్ల కింద భూమి కదిలి పోయి, మతిభ్రమించి విమర్శలు చేస్తున్నరు’’ అని విమర్శించారు. కుటుంబ పాలన అంతం కావాలని మోదీ అంటే.. తెలంగాణ మా కుటుంబం అని కేటీఆర్ కామెడీ చేశారని ఎద్దేవా చేశారు. కాగా, కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతున్నదని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర లిక్కర్ ఆదాయాన్ని రూ.6 వేల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచుకున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే సీఎంకు దగ్గు, జలుబు, జ్వరం వస్తాయని ఎద్దేవా చేశారు.