- హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
- యువత బీజేపీతో కలిసి రావాలన్న లక్ష్మణ్
- రాష్ట్రంలో 2.5లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న ఆర్.కృష్ణయ్య
లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న హామీపై హైదరాబాద్ ఆబిడ్స్ లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే ఆశతోనే నిరుద్యోగ యువత ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత లక్ష ఉద్యోగాలిస్తానన్న హామీని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. 35వేలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు. TSPSc పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇస్తే 20లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. సచివాలయానికే రాని సీఎం రూ.4వందల కోట్లతో కొత్త సచివాలయం కట్టడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం .. యువత సహాయంతో మరో ఉద్యమాన్ని చేస్తామన్నారు.
రాష్ట్రంలో రెండున్నర ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతోందని అన్నారు. 50 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటికే 4,600 పాఠశాలలు మూసివేశారనీ.. మరో 2వేలకు పైగా పాఠశాలలు మూసేందుకు సిద్ధమౌతున్నారని చెప్పారు. ఉద్యోగాల విషయంలో అంతా తన ఇష్టం అన్న విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హెల్త్ డిపార్టుమెంట్ లో 16 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. 15 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఉద్యోగాలు ఖాళీ అయితే నెలలోపు భర్తీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆర్.కృష్ణయ్య అన్నారు.