- నాలెడ్జ్ సిటీలో మరో 6 నుంచి 7 ఎకరాల అమ్మకానికి టీజీఐఐసీ కసరత్తు
- వచ్చే వారం నోటిఫికేషన్.. నవంబర్ నాటికి బిడ్డింగ్ ముగించేలా ప్లాన్
- గత బీఆర్ఎస్ సర్కార్ ఐఏఎంసీకి ఇచ్చిన 3.70 ఎకరాలు కూడా వేలం
- ఎకరం రిజర్వ్ ప్రైజ్ 200 కోట్లు నిర్ణయించే చాన్స్.. 1,500 కోట్ల రాబడి లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం భూముల వేలంతో భారీగా ఆమ్దానీ తెచ్చిన టీజీఐఐసీ.. మరో విడత వేలానికి సిద్ధమవుతున్నది. రాయదుర్గం పన్‌మక్తా, నాలెడ్జ్ సిటీ పరిధిలోని అత్యంత విలువైన రెండు ల్యాండ్ పార్సిళ్లను వేలం వేయాలని భావిస్తున్నది. 6 నుంచి 7 ఎకరాలు అమ్మేందుకు కసరత్తు చేస్తున్నది. వచ్చే వారంలో దీనికి సంబంధించి నోటిఫికేషన్, నవంబర్ నాటికి వేలం ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తున్నది. ఈ విడత వేలానికి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన రాయదుర్గం సర్వే నంబర్ 83/1లోని అత్యంత విలువైన 3.70 ఎకరాల భూమి కూడా ఉంటుందని తెలిసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ విలువ కూడా వసూలు చేయకుండా ఉచితంగా ఐఏఎంసీకి ఈ భూములను అప్పగించింది. 2022లో రూ.3 కోట్ల ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిగాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ కేటాయింపును రద్దు చేసింది. కోర్టు ఆదేశాలతో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని టీజీఐఐసీ ప్రభుత్వానికి లేఖ రాయగా.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారం రోజుల్లోగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌కు సర్కారు క్లియరెన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. దీనికి తోడు నాలెడ్జ్ సిటీలోనే ఉన్న మరో 3 ఎకరాల ప్లాట్‌ను కూడా వేలం వేయనున్నారు.
రూ.1,500 కోట్లు టార్గెట్
ఈ రెండు ల్యాండ్ పార్సిళ్ల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.1,500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 29న నిర్వహించిన వేలంలో ఎకరా రికార్డు స్థాయిలో రూ.269 కోట్లు పలికింది. ఈ నేపథ్యంలో తాజా వేలంలో ఎకరానికి కనీస రిజర్వ్ ధరగా రూ.200 కోట్లుగా నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. భూములు, స్థిరాస్తుల కొనుగోలుకు దసరా (నవరాత్రులు), దీపావళి పండుగల సీజన్ అనుకూలమైన సమయమని నమ్ముతుంటారు. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు, ఇళ్ల కొనుగోళ్లు జోరందుకుంటాయని ప్రభుత్వం భావిస్తున్నది.
