- కోటి 40 లక్షల మందికి.. మెగా ప్రమాద బీమా
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. రైతు బీమా
- రెండూ అమలు చేయాలని సర్కారు నిర్ణయం
- ఏటా 5,500 కోట్లు అవసరమని అందిన ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మెగా జీవిత బీమా పథకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఏ కారణం చేత చనిపోయినప్పటికీ లబ్ధిదారుని కుటుంబానికి (నామినీకి) రూ. 5 లక్షల తక్షణ ఆర్థిక సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన దాని ప్రకారం కొత్తగా అమల్లోకి తీసుకు రానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా దాదాపు కోటి మందికి పైగా లబ్ధిదారులకు జీవిత బీమా రక్షణ లభించనున్నది.
దీనికి తోడు ఇప్పటికే రైతు బీమా పథకం అమలు కూడా కంటిన్యూ చేస్తే దాదాపు 37 లక్షల మందికి జీవిత బీమా అందుతుంది. ఈ రెండు కలిపి దాదాపు కోటి 40 లక్షల మందిని జీవిత బీమా పథకంలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఏడాదికి సుమారు రూ. 5,500 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. వచ్చే ఆగస్టు 15తో రైతు బీమా గడువు ముగుస్తుంది.
దీంతో ఆలోపే రెండు పథకాల అమలునకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రైతు బీమా కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే ఒక స్కీమ్ బదులు.. రెండు అమలు చేస్తే జరిగే మేలుపై అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే జీవిత బీమా పథకాలు అమలు కానున్నాయి.
సీపెక్ డేటా ఆధారంగా..
రాష్ట్రంలోని ప్రతి సామాన్య కుటుంబానికి ధీమా కల్పించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ సంక్షేమ పథకం కోసం బడ్జెట్‌లో రూ.4 వేల కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. ప్రమాదవశాత్తు లేదా సహజ కారణాలతో కుటుంబ యజమాని మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా ఉండేందుకు రూ.5 లక్షల జీవిత బీమా పరిహారాన్ని ఈ పథకం ద్వారా ప్రభుత్వం నేరుగా నామినీ ఖాతాలో జమ చేయనుంది. తెలంగాణ సామాజిక-ఆర్థిక సర్వే (సీపెక్) ఆధారంగా నమోదైన దాదాపు కోటికి పైగా కుటుంబాలకు ఈ రక్షణ కల్పించనున్నారు.
ఇప్పటికే సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఈ పథకం అమలు కోసం భాగస్వామ్య సంస్థల ఎంపిక, ప్రీమియం చెల్లింపులు, లబ్ధిదారుల గుర్తింపులాంటి అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ పనిచేస్తున్నది. పేద, మధ్యతరగతి అనే తేడాలు లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ రక్షణ లభించేలా పథకం అమలు మార్గదర్శకాలను కేబినెట్సబ్ కమిటీ సిద్ధం చేస్తున్నది. త్వరలోనే ఇంటింటి సర్వే చేపట్టి నామినీ పేర్లను ఫైనల్ చేయనున్నారు.
రెండా?.. ఏదైనా ఒకటేనా ?
రైతు పట్టాదారు పాస్ పుస్తకం, 18 –59 ఏండ్ల వయసు కలిగి ఉంటే రైతు బీమా పథకానికి అర్హులుగా వ్యవసాయ శాఖ నమోదు చేస్తోంది. రైతు ఏ కారణం చేత మరణించినప్పటికీ (సహజ మరణం లేదా అనారోగ్యం లేదా ప్రమాదం) వారి కుటుంబానికి 10–15 రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా పరిహారం అందుతుంది. రైతులకు ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉచితంగా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాలు పొందిన రైతులను సైతం ఏటా ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా ఈ పథకం పరిధిలోకి తెస్తున్నారు. రెవెన్యూ రికార్డులను ఎప్పటికప్పుడు ధ్రువీకరిస్తూ అర్హులైన రైతుల జాబితాను ఎల్‌ఐసీకి పంపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కుటుంబాలు అకాల మరణాల వల్ల ఛిన్నాభిన్నం కాకుండా ఉండేందుకు ఈ పథకం ఒక భరోసాగా నిలిచింది. అయితే బడ్జెట్‌లో 2026–27 రైతు బీమా పథకానికి నిధులు కేటాయించలేదు.
రైతు బీమా అమలుకు దాదాపు రూ.1,400 కోట్లు అవసరం కానున్నాయి. ఈ మొత్తం బడ్జెట్‌లో కేటాయించపోవడంతో ఈ స్కీమ్ నిలిచిపోతుందనే భావన నెలకొంది. అయితే అటు రైతు బీమాలో 60 ఏండ్లలోపు పట్టాదారులంతా దాదాపు 37 లక్షల మంది బీమాలోకి వస్తే.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాలోనూ అటు భూమి లేని ఇటు భూమి ఉన్న వాళ్లంతా కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది.
దీంతో ఒక్కో కుటుంబం నుంచి ఒక్కరు లేదా ఇద్దరు జీవిత బీమా పొందే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏదేని కారణంతో జీవిత బీమాలో ఉన్న ఆ కుటుంబంలోని ఎవరైనా కాలం చెల్లితే.. ఆ ఫ్యామిలీకి ఆర్థికంగా భరోసా లభిస్తుంది. ఒకవేళ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఒక్కటే అమలు చేస్తే కోటి మందికి పైగా జీవిత బీమాలోకి వస్తారు. ఎక్కువ లబ్ధి.. ఎక్కువ కుటుంబాలకు మేలు జరగాలంటే రెండూ అమల్లో ఉండాలని సూచిస్తున్నారు.
ఏం చేసినా ఆగస్టు 15 డెడ్లైన్
జీవిత బీమా పథకాలు అమల్లోకి తీసుకురావాలంటే డెడ్లైన్ ఆగస్టు 15గా ఉన్నది. ఆ లోపు కాకపోతే ఆ తర్వాత ఏదైనా కుటుంబంలో దురదృష్టవశాత్తు మరణం సంభవిస్తే అటు రైతు బీమా రాక, ఇటు కుటుంబ జీవిత బీమా లేక తీవ్రంగా నష్టపోనున్నారు. అయితే ఇప్పటికే రైతు బీమా డేటాకు ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు మాత్రం క్షేత్రస్థాయిలో ఇన్సూరెన్స్ ఎవరి పేరుమీద చేయాలనే దాంతోపాటు ప్రతి ఇంటి నుంచి నామినీ పేరును అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇంటింటి సర్వే చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇంకా బీమా సంస్థను ప్రభుత్వం ఫైనల్ చేయలేదు. రైతు బీమాకు చేసిన ఎల్‌ఐసీనే ఇందిరమ్మకు కుటుంబ జీవిత బీమాకు పనిచేస్తుందా? లేక కొత్త సంస్థను ఎంపిక చేస్తారా అనేది ప్రీమియం రేట్లకు తగ్గట్టుగా నిర్ణయించనున్నారు.
