సర్కారు కాలేజీలకు కొత్త కళ..రూ.117.30 కోట్లతో పది కాలేజీలకు భవనాలు

సర్కారు కాలేజీలకు కొత్త కళ..రూ.117.30 కోట్లతో పది కాలేజీలకు భవనాలు
  • ‘పీఎంజేవీకే’ స్కీమ్ కింద ఇంటర్ విద్యాశాఖ ప్లాన్ 
  • నాంపల్లిలో రూ.27 కోట్లతో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్.. మిగతా చోట్ల కొత్త బ్లాకులు 
  • సర్కారుకు ప్రతిపాదనలు పంపిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. శిథిలావస్థలో ఉన్న గదులు, చాలీచాలని వసతులతో ఉన్న కాలేజీలకు కొత్త బిల్డింగులు కట్టించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని పది సర్కారు కాలేజీలను ఎంపిక చేసింది. 

ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యక్రమం(పీఎంజేవీకే) కింద కేంద్రం సహాయంతో ఈ పనులు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం రూ.117.30 కోట్లతో ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ సర్కారుకు ప్రతిపాదనలు కూడా పంపించింది. ఈ విషయంపై ఇటీవలే విద్యాశాఖ కార్యదర్శికి ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య లేఖ రాశారు.

స్మార్ట్ క్లాస్ రూమ్స్.. కొత్త ఫర్నిచర్

రాష్ట్రవ్యాప్తంగా సర్కారు కాలేజీల్లో ఉచిత విద్య, ఫ్రీ బుక్స్ ఇస్తుండటంతో అడ్మిషన్లు పెరిగాయి. అయితే చాలా చోట్ల పాత భవనాలు ఉండటం, తరగతి గదులు సరిపోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని, సౌలతులు పెంచేందుకు ఇంటర్మీడియెట్ ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేశారు. 

దీంట్లో భాగంగా స్మార్ట్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్లు, ఫర్నిచర్ కోసం కూడా ప్రతిపాదనలు చేశారు. మొత్తం పది కాలేజీలకు రూ.117.30 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అయితే, వీటిలో కేంద్రం వాటా (60%) కింద రూ. 70.38 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా (40%) కింద రూ. 46.92 కోట్లు భరించాల్సి ఉంటుంది.

నాంపల్లిలో హైటెక్ బిల్డింగ్

హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ ​కాలేజీ(జీజేసీ) బాయ్స్, ప్రభుత్వ గర్ల్స్​జూనియర్ ​కాలేజీ (జీవీజేసీ) రెండు కాలేజీలు ఒకే ఆవరణలో నడుస్తున్నాయి. ఇక్కడ రూ.27.30 కోట్లతో భారీ ‘ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్’ కట్టాలని ప్రతిపాదనలు చేశారు. మిగిలిన తొమ్మిది కాలేజీలకు ఒక్కో దానికి సుమారు రూ.10 కోట్లు, ఇతర వసతులకు రూ.8 కోట్లు కేటాయించాలని కోరారు.

ప్రతిపాదించిన కాలేజీలు

జీజేసీ (బాయ్స్) అండ్  జీవీజేసీ, నాంపల్లి (హైదరాబాద్), జీజేసీ ఫలక్ నుమా (బాయ్స్ అండ్ గర్ల్స్) (హైదరాబాద్), జీజేసీ గర్ల్స్  నల్గొండ, జీజేసీ బాయ్స్ ఆదిలాబాద్, జీజేసీ భైంసా (నిర్మల్), జీజేసీ ముధోల్ (నిర్మల్), జీజేసీ గర్ల్స్ మహబూబ్ నగర్, జీజేసీ బాయ్స్ నిజామాబాద్, ఎంఏఎం జీజేసీ గర్ల్స్ నాంపల్లి (హైదరాబాద్), జీజేసీ బోరబండ (హైదరాబాద్)