- అన్ని సంక్షేమ పథకాలను అనుసంధానించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడమే యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ప్రధాన లక్ష్యమని సీఎస్ కె. రామకృష్ణారావు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఒకే కార్డు ద్వారా పౌరులకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డు విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు.
ప్రభుత్వం అందించే రేషన్, పెన్షన్, మహాలక్ష్మి తదితర సంక్షేమ పథకాల వివరాలను ఒకే కార్డులో పొందుపరిచేలా “యూనిఫైడ్ వెల్ఫేర్ కార్డు” ను రూపొందించాలని ఆదేశించారు. ప్రజల డేటా భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, దీనిపై రాబోయే 10 రోజుల్లోగా తగు ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పెన్షన్ డేటా, ఆరోగ్య ప్రొఫైల్ వంటి సమాచారాన్ని కూడా ఈ కార్డుకు అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు.
సమావేశంలో స్పెషల్ సీఎస్‌లు వికాస్ రాజ్, సబ్యసాచి ఘోష్, ముఖ్యకార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానీయా, శైలజా రామయ్యర్, యోగితారాణా, క్రిస్టినా చొంగ్తు, సీజీజీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రవిగుప్తా మరియు వివిధ శాఖల కార్యదర్శులు, కమిషనర్లు పాల్గొన్నారు.
