16 లక్షల మంది టీ-వ్యాలెట్ డేటా మళ్లింపు!

16 లక్షల మంది టీ-వ్యాలెట్ డేటా మళ్లింపు!
  • నిర్వహణ సంస్థ ‘ట్రాన్సాక్షన్‌‌ అనలిస్ట్స్‌‌’పై దర్యాప్తు జరగాలన్న పోలీసులు
  • కేసు కొట్టివేయాలన్న కంపెనీ పిటిషన్‌‌ను తిరస్కరించాలని హైకోర్టులో కౌంటర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ అధికారిక డిజిటల్ పేమెంట్ ప్లాట్‌‌ఫారమ్ ‘టీ-వ్యాలెట్’కు చెందిన సుమారు 16 లక్షల మంది వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని, ఒక ప్రైవేట్ సంస్థ అక్రమంగా తన సొంత అప్లికేషన్‌‌కు మళ్లించేందుకు (డేటా చోరీ) ప్రయత్నిస్తోందని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. మీసేవ ఫైనాన్స్ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌‌లో సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ‘ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ హైకోర్టులో పిటిషన్ వేయగా, పోలీసులు దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

2017లో నామినేషన్ పద్ధతిపై టీ-వాలెట్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ కంపెనీ కాంట్రాక్ట్ గడువు 2025 మే 31తో ముగిసింది. అయితే, కొత్తగా ఎంపికైన ‘పర్‌‌వ్యూ ఇండియా కన్సల్టింగ్’ సంస్థకు సోర్స్ కోడ్, డేటా, ఇతర నియంత్రణ వివరాలను అప్పగించకుండా పాత సంస్థ అడ్డుపడుతోంది. వినియోగదారుల అనుమతి లేకుండా డేటాను బదలాయించకూడదన్న ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వారిని మోసపూరితంగా తమ సొంత 'టీఏ వ్యాలెట్'లోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ సంస్థ నుంచి ప్రభుత్వానికి దాదాపు రూ.14 కోట్ల దాకా రావాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని దుర్వినియోగం చేసినందుకు కంపెనీతోపాటు ఎండీ, సీఈవో కాటూరి శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ చీఫ్ ఎం.శ్రీనివాసులు, మేనేజర్ పి.కిరణ్‌‌కుమార్‌‌ను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున కంపెనీ వేసిన పిటిషన్‌‌ను కొట్టివేయాలని పోలీసులు కోర్టును కోరారు. దీనిపై జూన్‌‌లో హైకోర్టు విచారణ జరపనుంది.