- ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్
బషీర్బాగ్, వెలుగు: సమాజాన్ని చైతన్యం చేసేలా కళాకారులు తమ సాంస్కృతిక దృష్టికోణాన్ని మలుచుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ పిలుపునిచ్చారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ‘తెలంగాణ ప్రజానాట్యమండలి 4వ రాష్ట్ర మహాసభ’ ప్రతినిధుల సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమస్య తీవ్రత తెలిసినప్పుడే ఉద్యమం ఉప్పెనలా మారుతుందని, గూడ అంజయ్య రాసిన “దొర ఏందిరో.. దొర పీకుడెందిరో” పాట నాడు కార్మికులను ఎంతో చైతన్యం చేసిందని గుర్తుచేశారు. మహాసభను ప్రారంభించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహ మాట్లాడుతూ.. మతోన్మాద శక్తులు విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని, సోషల్ మీడియా ద్వారా కళా ప్రదర్శనలిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
ఎంఐఎం, బీజేపీ ఒక్కటేనని, ప్రధాని మోదీ కార్పొరేట్లకు దేశ సంపదను పంచుతూ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కన్నం లక్ష్మీనారాయణ, కలవేన శంకర్, ఎస్.చాయాదేవి, కె.శ్రీనివాస్, పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు.
