ములాఖత్‌‌ ల వల్ల పేలుళ్లకు కుట్రల నేది అబద్ధం : రాష్ట్ర జైళ్ల శాఖ

ములాఖత్‌‌ ల వల్ల పేలుళ్లకు కుట్రల నేది అబద్ధం : రాష్ట్ర  జైళ్ల శాఖ
  •     సోషల్‌‌ మీడియాలో వదంతులపై రాష్ట్ర జైళ్ల శాఖ వివరణ
  •     చంచల్‌‌గూడ జైలులో జాహెద్‌‌, చర్లపల్లిలో మరో ఇద్దరు టెర్రరిస్టులు
  •     జాహెద్ భార్యకు మాత్రమే ములాఖత్‌కు అవకాశం
  •     ముగ్గురు టెర్రరిస్టులపై నిరంతర నిఘా ఉంటుందని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: చంచల్‌‌గూడ జైలు ములాఖత్‌‌ల వల్లే టెర్రరిస్టులు హైదరాబాద్‌‌లో పేలుళ్లకు కుట్రలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర  జైళ్ల శాఖ ఖండించింది. వారం రోజులుగా సోషల్‌‌మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. పుకార్లను నమ్మొద్దని తెలిపింది.  ఈ మేరకు జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్‌‌, చంచల్‌‌గూడ  జైల్ సూపరింటెండెంట్‌‌శివకుమార్‌‌ గౌడ్‌‌ శనివారం మీడియాతో మాట్లాడారు.  

తీవ్రవాదుల ములాఖత్‌‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. చంచల్ గూడ జైలులో  లష్కరే తాయిబా మాడ్యుల్‌‌కు చెందిన జాహెద్‌‌తో పాటు చర్లపల్లి జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌‌ ఖైదీలుగా మరో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నారని చెప్పారు. మిగతా ఖైదీల తరహాలోనే వీరికి కూడా వారానికి రెండు ములాఖత్‌‌లు ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం జాహెద్ భార్యకు మాత్రమే ములాఖత్‌‌ అవకాశం ఉందని  తెలిపారు.

కౌంటర్ ఇంటెలిజెన్స్ సర్వెలెన్స్‌‌లో జాహెద్‌‌

ఈ ముగ్గురు టెర్రరిస్టులపై కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌‌ ప్రత్యేక నిఘా పెట్టింది. హైదరాబాద్‌‌లో వరుస పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని ఇటీవల జరిగిన ప్రచారంతో అప్రమత్తమైంది. జాహెద్‌‌, సమీయుద్దీ, మాజ్‌‌ హసన్‌‌ ఫరూక్‌‌ల ములాఖత్‌‌ వివరాలు సేకరించింది. 

వీరిని ఎవరెవరు కలిశారనే సమాచారంతో  రికార్డ్‌‌ను సిద్ధం చేసింది. ముగ్గురి ములాఖత్‌‌లతో పాటు వారి కుటుంబ సభ్యులపై కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌సెల్‌‌ పటిష్ట నిఘా కొనసాగిస్తోంది. ఆ వివరాలను నేషనల్‌‌ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహా దేశంలోని దర్యాప్తు సంస్థలకు ఎప్పటికప్పుడు అందిస్తోంది.

ఇదీ కేసు నేపథ్యం 

దసరా ఉత్సవాలు, బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌ మీటింగ్స్, ర్యాలీలు టార్గెట్‌‌గా గ్రనేడ్‌‌ పేలుళ్లకు కుట్ర చేశారనే కేసులో 2022  అక్టోబర్ 2న జాహెద్‌‌ సహా నలుగురిని హైదరాబాద్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌, కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌ సెల్‌‌ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. వీరిలో ముసారాంబాగ్‌‌కి చెందిన అబ్దుల్‌‌ జాహెద్‌‌, సైదాబాద్‌‌కి చెందిన సమీయుద్దీన్‌‌, మెహిదీపట్నం రాయల్‌‌కాలనీకి చెందిన మాజ్‌‌ హసన్‌‌ ఫరూక్‌‌లు గ్రనేడ్‌‌ దాడులకు పథకం రచించారని ఆధారాలు సేకరించారు. 

పాకిస్తాన్‌‌ నుంచి జాహెద్‌‌ అకౌంట్స్‌‌కి రూ.30 లక్షలు ట్రాన్స్‌‌ఫర్ కాగా, జాహెద్‌‌ అకౌంట్‌‌ నుంచి రూ.3.91లక్షలు సమీయుద్దీన్‌‌ నుంచి రూ.1.50 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో విధ్వంసాలకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఐఎస్‌‌ఐ, లష్కరే తాయిబా హ్యాండ్లర్‌‌‌‌ ఫర్హతుల్లా ఘోరి ఆదేశాలతో  పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఆధారాలు లభించాయి. దాంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ ఖైదీలుగా జైలులో పెట్టారు.