- అడ్మిషన్ షెడ్యూల్ రాకముందే బీ కేటగిరీ సీట్ల అమ్మకాలు
- టాప్ కాలేజీల్లో రూ.10 నుంచి 20 లక్షల వరకు డొనేషన్లు
- లక్షలు వసూలు చేస్తున్నా.. రిసిప్టులు కరువు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటు టీజీ ఎప్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయో లేదో.. అటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల బేరసరాలు మొదలయ్యాయి. సర్కారు ఇంకా కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించకముందే, ప్రైవేటు కాలేజీలు మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. సర్కారు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, పేరెంట్స్ నుంచి లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. ఈ అక్రమ వసూళ్లపై విద్యాశాఖ, టీజీసీహెచ్ఈ, యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
లక్ష సీట్లు అందుబాటులో..
రాష్ట్రంలో 155 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, దాదాపు లక్ష సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం మేనేజ్మెంట్ (బీ కేటగిరీ) సీట్లు ఉంటాయి. నిబంధనల ప్రకారం.. బీ కేటగిరి అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశాకే మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేయాలి. కానీ, ఆ నిబంధనలకు అర్థం లేకుండా పోయింది. ప్రస్తుతం టాప్ కాలేజీల్లో సీటు కావాలంటే ఏకంగా రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. రెండో శ్రేణి కాలేజీలు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేస్తుండగా, రూరల్ ప్రాంతాల్లోని కొన్ని చిన్న కాలేజీలు రూ. లక్ష నుంచి రెండు లక్షలకే సీట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
రిసిప్టులు ఇవ్వట్లే..
కాలేజీలు విద్యార్థుల దగ్గర భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నా, ఎక్కడా ఎలాంటి రిసిప్టులు ఇవ్వడం లేదు. రికార్డుల్లోకి రాకుండా నల్లధనంగా ఈ మొత్తాన్ని దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు గానీ, యూనివర్సిటీ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అధికారుల నిర్లక్ష్యమే కాలేజీ యాజమాన్యాలకు వరంగా మారి, ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతున్నాయి. విద్యార్థి సంఘాలు, ఓయూ జేఏసీ నేతలు ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవడం
లేదనే ఆరోపణలున్నాయి.
సర్కార్ వద్దే ఆన్ లైన్ ప్రతిపాదన
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల దందాపై గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే.. మెడికల్ సీట్ల కేటాయింపు మాదిరిగానే, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా ఆన్ లైన్ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఆ ప్రతిపాదనల ఫైల్ ఎక్కడ ఉందో, ఎందుకు పెండింగ్‌లో ఉందో తెలియని పరిస్థితి. సర్కార్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. కాలేజీలు తమ దందాను మరింత ముమ్మరం చేశాయి.
పేరెంట్స్ లో ఆందోళన..
పేరెంట్స్ ఆశలు, నమ్మకాన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు సొమ్ము చేసుకుంటున్నాయి. తక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులే లక్ష్యంగా భారీగా ఫీజులు పెంచేశాయి. తొందరపడకపోతే సీట్లు దొరకవనే భయాన్ని ఏజెంట్లు, సిబ్బంది ద్వారా ప్రచారం చేస్తూ.. కాలేజీలు సీట్ల అమ్మకానికి తెరలేపాయి. దీనిలో ప్రజాప్రతినిధుల కాలేజీలూ మినహాయింపు లేకపోవడం గమనార్హం. ఫస్ట్ ఫేజ్ ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యాకే.. బీ కేటగిరి సీట్ల అడ్మిషన్లకు విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. కానీ, అసలుల ఏ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించకముందే మేనేజ్మెంట్ కోటా సీట్ల అమ్మకాలను ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని పేరెంట్స్ కోరుతున్నారు. పారదర్శకత కోసం ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
