ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి : గౌరీ సతీశ్

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి : గౌరీ సతీశ్
  • ప్రభుత్వానికి జూనియర్ కాలేజీల మేనేజ్​మెంట్ అసోసియేషన్ విజ్ఞప్తి 

బషీర్​బాగ్, వెలుగు : ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్​మెంట్​ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లించకుండా స్టూడెంట్ల జీవితాలతో  చెలగాటమాడిందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని కోరారు. సోమవారం ఆయన అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

అనంతరం గౌరీ సతీశ్ మాట్లాడుతూ..విద్యాశాఖ నోటిఫికేషన్ ఇవ్వకముందే కొన్ని కార్పొరేట్ కాలేజీలు అడ్మిషన్లు తీసుకుంటున్నాయని ఆరోపించారు. అలాంటి కాలేజీలను వెంటనే నిలిపివేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే.. 360 కాలేజీలకు ఉన్న మిక్స్​డ్ ఆక్యుపెన్సీ సమస్యను పరిష్కరించాలన్నారు.

కాగా.. హైదరాబాద్ జిల్లా నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా ఉమా శంకర్, ప్రధాన కార్యదర్శిగా సుధాకర్ రెడ్డి, ట్రెజరర్​గా శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అహ్మద్, ఉస్మాన్, జాయింట్ సెక్రటరీగా సిద్ధిఖి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎండీ అక్రమ్, షేక్ హైదర్ ఎన్నికయ్యారు.