
- డిండికి రూ.1,600 కోట్లు
- గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.1,300 కోట్లు ఎక్కువ
- పాలమూరు–రంగారెడ్డికి రూ.1,714 కోట్లు
- ఇరిగేషన్ కు మొత్తంగా రూ.23,373 కోట్ల ప్రతిపాదన
- ఇందులో కాళేశ్వరం అప్పులకే రూ.6,914 కోట్లు
హైదరాబాద్, వెలుగు:బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు రాష్ట్ర సర్కారు ఎక్కువ నిధులను కేటాయించింది. కుంగి మూలకుపడిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.2,685 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. డిండి లిఫ్ట్ స్కీమ్ కోసం దాదాపు రూ.1,600 కోట్ల నిధులను బడ్జెట్లో పెట్టింది. డిండికి గతేడాదితో పోలిస్తే ఇప్పుడు దండిగా నిధులను పెంచింది. ఇక, గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఇరిగేషన్ శాఖ బడ్జెట్ పెరిగింది. గత బడ్జెట్ లో ఇరిగేషన్‌కు రూ.22,301 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.23,373 కోట్లను కేటాయించింది. దాదాపు రూ.1,072 కోట్లను సర్కారు పెంచింది. తాజా బడ్జెట్లో ప్రస్తుత ప్రాజెక్టుల నిర్వహణ, అప్పులకు రూ.11,544 కోట్లు ఇవ్వగా.. ప్రగతి పద్దు కింద రూ.11,829 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. నిర్వహణ బడ్జెట్ లోని రూ.11,544 కోట్లలో రూ.9,877.01 కోట్లు రుణాల చెల్లింపులకు పోతాయని బడ్జెట్ లో పేర్కొంది. మిగతా రూ.1,667 కోట్లు ఇరిగేషన్ శాఖలో అధికారులు, సిబ్బంది జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ వ్యయాలను చూపించింది. రూ.9,877 కోట్ల అప్పుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఒక్క కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా తీసుకున్న రుణాల వాయిదా చెల్లింపుల కోసమే రూ.6,914.54 కోట్లను బడ్జెట్లో సర్కారు ప్రతిపాదించింది. మరో రూ.2,962.47 కోట్లను తెలంగాణ వాటర్ రీసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన అప్పులకు కేటాయించింది.
ప్రాజెక్టులకు నిధులు పెరిగినయ్
ప్రగతిపద్దు కింద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులు, ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి నిధులను పెంచింది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులైన పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ స్కీమ్ వంటి ప్రాజెక్టులకు నిధులను పెంచింది. ఈ బడ్జెట్లో డిండి లిఫ్ట్ స్కీమ్‌కు ప్రభుత్వం నిధులను ఎక్కువగా కేటాయించింది. నిరుడు ఈ ప్రాజెక్ట్ కోసం రూ.300 కోట్లే కేటాయించగా.. ఈ సారి ఏకంగా రూ.1,598 కోట్లు కేటాయించి ఆ ప్రాజెక్టుపై తన ఉద్దేశాన్ని చాటింది.
ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అంచనాలను కూడా సిద్ధం చేసింది. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్‌కు లింక్ చేసేలా ఏదుల రిజ్వరాయర్ నుంచి డిండి వరకు ఈ ప్రాజెక్ట్ ద్వారా నిధులను కేటాయించింది. ఇటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.1,714 కోట్ల కేటాయింపులను చేసింది. నిరుడు రూ.1285 కోట్లు కేటాయించగా.. ఈసారి బడ్జెట్‌ను రూ.429 కోట్లు పెంచింది.
ఎస్ఎల్బీసీ కూడా ప్రాధాన్య జాబితాలోనే
ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటిని అందించే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టునూ సర్కారు ప్రాధాన్యంగా తీసుకుంది. ఈ ఏడాది చివరినాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు.. ప్రాజెక్టు కోసం రూ.899.90 కోట్ల కేటాయింపులు చేసింది. గత ఏడాదితో పోలిస్తే వంద కోట్లు పెరిగాయి.
ఇటు కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ కోసం రూ.800 కోట్లు, సీతారామ లిఫ్ట్ స్కీమ్‌కు రూ.643.04 కోట్లు, సీతమ్మ బహుళార్థసాధక ప్రాజెక్టు కోసం రూ.56.31 కోట్లను కేటాయించింది. త్వరలో ప్రారంభిస్తామని చెబుతున్న ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రస్తుతానికి ప్రభుత్వం రూ.32.27 కోట్ల నిధులను కేటాయించింది. ఇక, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పలు రిపేర్లు ఉండడంతో ఆ ప్రాజెక్టుకు కూడా సర్కారు కేటాయింపులను పెంచింది. నిరుడు నాగార్జునసాగర్‌కు కేవలం రూ.96 కోట్లే కేటాయించిన ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో రూ.297.95 కోట్లను కేటాయించడం విశేషం.
కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అవకవతకల వల్ల నిరుపయోగంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో అక్కడ సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయి. అలాగే, గేట్లు చెడిపోవడం, ఇతర పనులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.2,685 కోట్లను కేటాయించింది.
ఆ పనుల కోసమే రూ.700.50 కోట్లను అలాట్ చేసింది. కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల పనుల కోసం రూ.1,736.84 కోట్లను బడ్జెట్లో ప్రతిపా దించింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం రూ.245 కోట్లు సహా.. ఆ ప్రాజెక్టుకు భారీగానే నిధులను కేటాయించడం గమనార్హం. నిరుడు బడ్జెట్లో ఆ ప్రాజెక్టకు రూ.1,676 కోట్లే కేటాయించగా.. ఇప్పుడు ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ఎక్కువ నిధులను కేటాయించింది. కరీంనగర్లో వివిధ ప్రాజెక్టుల కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం రూ.300 కోట్లను సర్కారు కేటాయించింది.