- సగం ఆక్రమించి.. రిపేర్లు చేయలేక మనదే బాధ్యతంటూ బోర్డుకు ఇటీవల ఏపీ లేఖ
- ఏపీ రాసిందే తడవుగా.. రిపేర్లు చేయాలంటూ మనపై బోర్డు పెత్తనం
హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ).. ఏపీ చెప్పినట్టల్లా ఆడుతున్నది. తెలంగాణ విజ్ఞప్తులను పట్టించుకోని బోర్డు.. ఏపీ ఏం చెప్తే దానికి మాత్రం తలూపుతున్నది. తాజాగా నాగార్జునసాగర్ రిపేర్ల అంశమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. ప్రాజెక్టు కుడివైపు గేట్లను ఏపీ స్వాధీనం చేసుకోగా.. కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్నూ తన గుత్తాధిపత్యంలోకి తీసుకున్నది.
వాస్తవానికి తెలంగాణే వాటి బాధ్యతలను చూసుకోవాల్సి ఉన్నా.. ఏపీ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నది. తాజాగా సాగర్ గేట్లకు తెలంగాణే రిపేర్లు చేయాలంటూ ఏపీ కోరగానే.. రాష్ట్ర సర్కారుకు కృష్ణా బోర్డు లేఖ రాయడం గమనార్హం. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ గేట్లతో పాటు.. ఏపీ వైపున్న ప్రాజెక్టు గేట్లను ఇన్నాళ్లూ పొరుగు రాష్ట్రం పట్టించుకోకపోవడంతో.. వాటి నిర్వహణ కష్టంగా మారింది.
ఈ నేపథ్యంలోనే వాటికి గ్రీజింగ్, రబ్బర్ సీల్స్ మార్పిడి, గ్యాలరీ తదితర రిపేర్లు చేయాలంటూ బోర్డు లేఖ రాసినట్టు తెలిసింది. దీనిపై తెలంగాణ అధికారులు సీరియస్ అవుతున్నారు. ఏపీ అడ్డంగా నీళ్లను తరలించుకుపోతున్నా ఆపని బోర్డు ఇప్పుడు రిపేర్లు చేయాలంటూ తెలంగాణకు మాత్రం లేఖ రాయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ప్రాజెక్టు కుడివైపు భాగమంతా ఏపీ ఆక్రమించుకుని.. కనీసం తెలంగాణ అధికారులను అటువైపే రానివ్వడం లేదని, రెండేండ్లుగా రిపేర్లనూ ఆ రాష్ట్రం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ప్రాజెక్టును అప్పగించకుండా.. రిపేర్లు చేయాలంటూ తెలంగాణను అడగడమేందని నిలదీస్తున్నారు. దీనిపై కృష్ణా బోర్డు కనీసం.. ఏపీకి లేఖ రాయడం కాదు కదా కనీసం పల్లెత్తు మాట కూడా అనడం లేదంటూ ఫైర్ అవుతున్నారు.
గతంలో ఏపీ అభ్యంతరాలు..
బోర్డు అనుమతులతో కుడివైపు డ్యామ్ మెయింటనెన్స్ పనులను తెలంగాణ గతంలో చేపట్టగా ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పనులను ఎందుకు చేస్తున్నారు? అత్యవసరమైనవా? కావా? అనేది తెలుసుకోవాలని ఏకంగా కేఆర్‌ఎంబీకే లేఖ రాసింది. ఆ తరువాత డ్యామ్‌కు సంబంధించి ఏపీ భూభాగంలో ఉన్న డ్యామ్ నిర్మాణాలకు సంబంధించిన మరమ్మతులు, మెయింటనెన్స్ పనులను తామే చేసుకుంటామని బోర్డుకు తేల్చిచెప్పింది.
అందుకు అనుమతులివ్వాలని బోర్డు చైర్మన్‌కు లేఖ కూడా రాసింది. వర్షాకాలం ముందు, ఆ తరువాత చేపట్టాల్సిన తనిఖీలు, సాధారణ, అత్యవసర పనులు, నీటి విడుదల వంటి వాటిని ఏపీకే అప్పగించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మరమ్మతు పనుల అంశంపై త్రిమెంబర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, అందులో నిర్ణయం తీసుకోవాలని బోర్డు గతంలో నిర్ణయించినా అది చేయకుండా ఏపీకే అప్పగించింది.
కానీ, ఒక్క పని కూడా ఏపీ చేయలేదు. కుడి కాల్వ హెడ్‌రెగ్యులేటర్ గేట్లను ఇష్టారాజ్యంగా ఆపరేట్ చేయడం, గ్రీజింగ్ వంటి పనులను చేయకపోవడంతో గేట్లలో సమస్యలు వస్తున్నాయి. గేట్లు ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్ నిర్వహణపై ఇటీవల ఎన్డీఎస్ఏ ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా.
కానీ, ఏపీ మాత్రం ఆ కారణాన్ని తెలంగాణపైకి తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. రిపేర్ల బాధ్యత తెలంగాణదేనంటూ తాజాగా ఏపీకి లేఖ రాయడంతో.. బోర్డు ఆ వెంటనే తెలంగాణకు లేఖ రాసి వివరణ కోరడం కృష్ణాబోర్డు ద్వంద్వ నీతికి అద్దం పడుతున్నది.
