Rain alert: తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు ... 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావారణ కేంద్రం

Rain alert:  తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు ... 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావారణ కేంద్రం
  • ఇయ్యాల, రేపు భారీ వర్షాలు 
  • అల్పపీడనం.. వాయుగుండంగా మారే చాన్స్ ఉందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పశ్చిమ మధ్య  బంగాలాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారింది. ఈ నేపథ్యంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే చాన్స్ ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శని వారాలు భారీ వర్షాలు కురుస్తాయని, ఆదివారం ఓ మోస్తారు వర్షాలు కురుస్తామని కేంద్రం పేర్కొంది. 

గురువారం ములుగు జిల్లా ఏటూరు నాగారం, మేడారంలో అత్యధికంగా 7 సె.మీ. వర్షం కురిసింది. శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం సైతం 15 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్​ రెడ్డి

రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ ఇచ్చిన నివేదికపై అన్ని శాఖలను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు.  ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నందున నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్ తో ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. 

అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని కాజ్ వేలను పరిశీలించాలని, రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ ను నిలిపివేయాలన్నారు. 

విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.  వేలాడే వైర్లను తొలగించడంతో పాటు, ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. 

దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.