ఆర్ అండ్ బీకి జాతీయ అవార్డు..నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాలు పాటించినందుకు ఎంపిక

ఆర్ అండ్ బీకి జాతీయ అవార్డు..నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాలు పాటించినందుకు ఎంపిక

హైదరాబాద్, వెలుగు: నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విశేష ప్రతిభ చూపినందుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నేషనల్  సేఫ్టీ కౌన్సిల్  ఆఫ్  ఇండియా (ఎన్ఎస్ సీఐ) ప్రకటించిన జాతీయ భద్రతా అవార్డుకు ఎంపికైంది. వరంగల్​లోని రంగంపేటలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  పనుల్లో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ, కార్మిక భద్రత చర్యలు సమర్థంగా అమలైనందుకు ఈ అవార్డుకు ఎస్ఎస్ సీఐ ఎంపిక చేసింది. 

ఎన్ఎస్ సీఐ పరిశీలనలో భాగంగా ప్రాజెక్టు అమలు విధానం, భద్రతా ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మానిటరింగ్  సిస్టం, ప్రమాదాల నివారణ చర్యలు వంటి అంశాలను విశ్లేషించారు. రాష్ట్రం పాటించిన విధానం ఆదర్శంగా నిలిచిందని ఆఫీసర్లు ప్రకటించారు. ఆర్ అండ్ బీ శాఖ తరపున చీఫ్ ఇంజినీర్ రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం ఢిల్లీలో ఈ అవార్డు అందుకోనుంది. ఈ సందర్భంగా అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఓ ప్రకటనలో అభినందించారు.

 తమ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ‘‘గత పదేండ్లలో రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలో సుమారు కోటి చదరపు అడుగుల ప్రభుత్వ నిర్మాణాలు జరిగితే, మా ప్రభుత్వం ఏర్పాటైన రెండేండ్లలోనే దాదాపుగా అదే స్థాయిలో నిర్మాణాలు జరిగాయి. వేగం మాత్రమే కాకుండా భద్రత, నాణ్యత కూడా సమానంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం’’ అని మంత్రి తెలిపారు.