- డిఫెన్స్, ఫార్మా, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్
- 2024లో రూ.1.17 లక్షల కోట్ల బిజినెస్
- అత్యధికంగా అమెరికాకు28 శాతం ఎగుమతులు
- ‘ఈపీఐ–2024’ రిపోర్ట్ రిలీజ్ చేసిన నీతి ఆయోగ్
న్యూఢిల్లీ, వెలుగు: విదేశీ ఎగుమతుల్లో దేశంలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. 57.14 పాయింట్లతో లీడర్ స్టేట్ గా తెలంగాణ చోటు దక్కించుకున్నది. 2023తో పోలిస్తే (2.6 నుంచి 3.2 శాతం) 6 శాతం వృద్ధి కనబరిచింది. అయితే, 2022తో పోలిస్తే మాత్రం 61.36 పాయింట్లతో 6వ ర్యాంక్ నుంచి ప్రస్తుతం 57.14 పాయింట్లతో 8వ స్థానానికి దిగజారింది. ఈ మేరకు దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు/యూటీలు/నార్తీస్ట్ స్టేట్ల ఎగుమతులకు సంబంధించి ఎక్స్ పోర్ట్ ప్రిపేర్డ్ నెస్ ఇండెక్స్ (ఈపీఐ)–2024 పేరుతో నీతి ఆయోగ్ బుధవారం రిపోర్ట్ విడుదల చేసింది.
పెద్ద రాష్ట్రాల ర్యాకింగ్ లో 68.01 పాయింట్లతో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడు (64.41 పాయింట్లు), గుజరాత్ (64.02), ఉత్తర ప్రదేశ్ (62.09), ఆంధ్రప్రదేశ్ (60.65) చోటు దక్కించుకున్నాయి. జార్ఖండ్ (42.49 పాయింట్లు), బిహార్ (46.31 పాయింట్లు), రాజస్థాన్ (47.31 పాయింట్లు) చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ (52.07 పాయింట్లు), జమ్మూ కాశ్మీర్ (51.08 పాయింట్లు), నాగాలాండ్ (46.42 పాయింట్లు) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. లక్ష్యదీప్ (22.76 పాయింట్లు), మణిపూర్ (28.29 పాయింట్లు), మిజోరం (30.24 పాయింట్లు) చివరి మూడు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
దేశ జీడీపీలో 5 శాతం
2024లో తెలంగాణ నుంచి రూ.1.17 లక్షల కోట్ల ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అయ్యాయి. 2023 రూ.95 వేల కోట్ల ఎగుమతులతో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ.. 2024లో రూ.లక్ష కోట్లు దాటి 8వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం 57.14 పాయింట్లతో లీడర్ విభాగంలో నిలిచింది. తెలంగాణ నుంచి అత్యధికంగా అమెరికాకు 28.17 శాతం ఎగుతులు జరిగాయి.
ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ (6.90 శాతం), చైనా (5.21శాతం), సౌదీఅరేబియా (4.01 శాతం), కువైట్ (3.7 శాతం)కు ఎగుమతులు జరిగాయి. ఎరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఎలక్ట్రికల్ పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. కాగా, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.8 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది.
2023–24లో తెలంగాణ జీఎస్ డీపీ రూ.14.6 లక్షల కోట్లు చేరింది. కాగా, తెలంగాణ నుంచి అత్యధికంగా మొత్తం 10 వస్తువులు విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. ఇందులో ఔషధాలు రూ.24,187 కోట్లు, ఎయిర్‌క్రాఫ్ట్స్, స్పేస్ క్రాఫ్ట్స్, లాంచ్ వెహికల్స్ రూ.14,670 కోట్లు, నైట్రోజన్ హెటెరోసైక్లిక్ సమ్మేళనాలు రూ.5,036 కోట్లు, మిరియాలు, క్యాప్సికం రూ.2,273 కోట్లు, యాంటీ బయోటిక్స్ రూ.1,858 కోట్లు, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫార్మర్స్ రూ.1,726 కోట్లు, జ్యూవెల్లరీ ఆర్టికల్స్ రూ.1,708 కోట్లు గా ఉన్నాయి.
