- యూరియా బుకింగ్‌కు డిజిటల్ సౌకర్యాలు
- ఎల్‌నినో ఎఫెక్ట్‌కు ముందస్తు ప్లాన్.. ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం
- 90 లక్షలకు పైగా యూరియా బస్తాల స్టాక్.. కొరత లేదంటున్న అధికారులు
- వాట్సాప్‌లో వ్యవసాయ సేవలు
హైదరాబాద్, వెలుగు : వానాకాలం సీజన్‌కు వ్యవసాయశాఖ సన్నద్ధమైంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తోంది. విత్తనాలు, ఎరువుల సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, వాతావరణ సమాచార సేవల విస్తరణ వంటి అంశాలపై స్పెషల్ఫోకస్పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1.34 కోట్ల ఎకరాల సాగుకు అవసరమైన 87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసింది.
తక్కువ నీటితో సాగయ్యే కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను జిల్లాల వారీగా నిల్వ ఉంచి, అవసరమైన ప్రాంతాలకు సప్లై చేసేందుకు చర్యలు చేపట్టింది. వరి సాగుపైనే ఎక్కువగా ఆధారపడకుండా పంటల మార్పిడి వైపు రైతులను మళ్లించేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఎరువుల పంపిణీలో డిజిటల్ విధానం
ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను మరింత ఆధునికీకరించింది. రైతుల సూచనల మేరకు జిల్లా వారీగా డీలర్ల స్టాక్ వివరాలు, మండలాల మ్యాపింగ్, మీ సేవ కేంద్రాల ద్వారా బుకింగ్ సౌకర్యం వంటి అదనపు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు ఇండ్ల వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకునేలా ఈ సిస్టమ్‌ను డిజైన్ చేశారు. స్మార్ట్‌ఫోన్లు లేని రైతుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. రైతులు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయితే వారి తరఫున సిబ్బంది యూరియా బుకింగ్ ప్రాసెస్ పూర్తి చేయనున్నారు.
అక్రమ రవాణాకు చెక్
యూరియా అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, పరిశ్రమలకు మళ్లింపు వంటి దుర్వినియోగాలను అరికట్టేందుకు డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అక్రమార్కులు యూరియా కొనుగోలు చేయకుండా యాక్షన్ ప్లాన్ చేపట్టింది. ఇంటర్నేషనల్ పరిస్థితుల ప్రభావంతో సప్లైలో సవాళ్లు ఎదురైనా, కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుని రాష్ట్రానికి అవసరమైన యూరియా కోటాను సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించింది.
రైతులకు వాతావరణ సమాచార సేవలు.
వాతావరణ వివరాలను రైతులకు సకాలంలో అందించేందుకు ‘తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం’ను వ్యవసాయశాఖ సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తోంది. మండలాల వారీగా వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా రైతులకు సమాచారం చేరవేస్తోంది. విత్తనాలు విత్తడం, ఎరువుల వాడకం, నీటి యాజమాన్యం, పంట సంరక్షణ వంటి అంశాల్లో ఈ సమాచారం రైతులకు గైడ్‌లా నిలుస్తోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 28 లక్షల మందికి పైగా రైతులకు వాతావరణ సమాచార మెసేజ్‌లు చేరాయి. 71 శాతం డెలివరీ రేటుతో ఈ కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఎల్‌నినో ప్రభావానికి ప్రత్యామ్నాయ ప్రణాళిక ..
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేసింది. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఆయిల్ పామ్ వంటి లాభసాటి పంటల సాగును ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. వానాకాలం సీజన్‌ను సక్సెస్ చేయడమే లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.
90.22 లక్షల యూరియా బస్తాల నిల్వలు
రాష్ట్రంలో యూరియా స్టాక్ సమృద్ధిగా ఉందని అధికారులు తెలిపారు. రిటైల్ షాపుల్లో 22.67 లక్షల బస్తాలు, సహకార సంఘాల వద్ద 5.56 లక్షల బస్తాలు, మార్క్‌ఫెడ్ వద్ద 59.56 లక్షల బస్తాలు, గోదాముల్లో 3.56 లక్షల బస్తాలు కలిపి మొత్తం 90.22 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఇప్పటివరకు 4.06 లక్షల మంది రైతులు 13.22 లక్షల యూరియా బస్తాలను బుక్ చేసుకోగా, వాటిలో 11.18 లక్షల బస్తాలు ఇప్పటికే రైతులకు పంపిణీ అయ్యాయి. బుక్ చేసిన యూరియాలో 84.6 శాతం విజయవంతంగా రైతుల చేతికి చేరినట్లు అధికారులు తెలిపారు.
