- సీఎస్ చైర్మన్.. ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులకు చోటు
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- విధివిధానాలు, హెల్త్ కార్డుల జారీపై త్వరలో బోర్డు మీటింగ్
హైదరాబాద్, వెలుగు : ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) సమర్థవంతమైన అమలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో జారీ చేసిన పలు మార్గదర్శకాలను సమీక్షించిన అనంతరం.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించింది. పునర్వ్యవస్థీకరించిన బోర్డుకు సీఎస్ కే. రామకృష్ణారావు చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు.
ఆర్థిక, వైద్య ఆరోగ్య, విద్యా, హోం, సాధారణ పరిపాలన, పురపాలక, పంచాయతీరాజ్, ఎస్సీ అభివృద్ధి, కార్మిక, మహిళా శిశు సంక్షేమ న్యాయ శాఖలకు చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు లేదా సెక్రటరీలు బోర్డులో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సెర్ప్ సీఈఓ, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈఓలు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈహెచ్‌ఎస్ సీఈఓ ఈ బోర్డుకు మెంబర్- కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలకు చోటు
కొత్త బోర్డులో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం తగిన స్థానం కల్పించింది. టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పి. దామోదర్ రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు చావ రవితో పాటు తెలంగాణ సెక్రటేరియెట్ అసోసియేషన్, ఎస్టీయూ టీఎస్, ట్రెసా, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులను సభ్యులుగా నియమించారు.
అలాగే, పెన్షనర్ల తరఫున టీఎస్‌జీఆర్‌ఈఏ ప్రెసిడెంట్ పి. వెంకట్ రెడ్డి, టీఏపీఆర్‌పీఏ జనరల్ సెక్రటరీ పి. కృష్ణమూర్తి, తెలంగాణ మహిళా పెన్షనర్ల అసోసియేషన్ చైర్‌పర్సన్ ఆర్. ఉమాదేవికి బోర్డులో సభ్యత్వం లభించింది. నూతనంగా ఏర్పాటైన బోర్డు త్వరలోనే సమావేశమై ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలుకు అవసరమైన మార్గదర్శకాలను ప్రతిపాదించాల్సి ఉంటుంది. గతంలో జారీ చేసిన నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉద్యోగులకు కొత్తగా హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలను ఈ బోర్డు ఖరారు చేయనుంది.
