తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 8 నుంచి రెండు రోజుల పాటు సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశ విదేశాలనుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది.
సదస్సుకు వేలాదిగా తరలివస్తున్న అతిథులు, వీఐపీల భద్రత దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 6వేల మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ADGPలు, IGలు, 10 మంది IPS అధికారులు, పలువురు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వేదిక దగ్గర దాదాపు 1,200 మంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు.
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ కే శశాంక ఆధ్వర్యంలో 25 ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దాదాపు 2,000 మంది అతిథులు, 2,500 మంది ప్రభుత్వ అధికారులు పాల్గొనే ఈ ఈవెంట్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 3 వారాలుగా సాగుతున్న సన్నాహాలు ఆదివారం నాటికి కొలిక్కి వచ్చాయని, ఈ సదస్సు తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు.
