
- మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో భారీగా నష్టం
- తాత్కాలిక మరమ్మతులకు ఆదేశించిన ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, వెలుగు : మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదల వల్ల ఉత్తర తెలంగాణలో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయతీరాజ్ రోడ్లు తెగిపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో రోడ్ల మీది నుంచి వరద ప్రవహిస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్‌అండ్‌బీ పరిధిలోని 37 డివిజన్లలో 794 చోట్ల ఓవర్ ఫ్లో, గండ్లు, గుంతలు, ఇతరత్రా సమస్యలు ఏర్పడ్డాయి.1,039 కిలోమీటర్ల మేర రోడ్లు డ్యామేజీ అయ్యాయి. 31 చోట్ల రోడ్లు తెగిపోగా, 10 చోట్ల తాత్కాలిక రిపేర్లు చేశారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నివేదించారు. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయని మంత్రికి వివరించారు.
356 చోట్ల కాజ్‌వేలు, కల్వర్టుల మీదుగా వరద ప్రవాహం ఉండగా, 289 చోట్ల వాహనాలను దారి మళ్లించామన్నారు. రోడ్లు, కాజ్‌వేలు, కల్వర్టులు, మైనర్ బ్రిడ్జిలను పునరుద్ధరించాల్సి ఉందని, టెంపరరీ రిపేర్ల కోసం రూ. 53.76 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ. 1157.46 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు మంత్రికి స్పెషల్ సీఎస్ వివరించారు.
గురువారం ఆర్‌అండ్‌బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్44పై కామారెడ్డి, నిర్మల్ వద్ద జరిగిన డ్యామేజీ, నిలిచిన రాకపోకలపై ఆరా తీసిన మంత్రి వెంటనే తాత్కాలిక రిపేర్లు పూర్తి చేసి, ట్రాఫిక్‌ను క్లియర్చేయాలని ఆదేశించారు.
రోడ్లు తెగిన చోట, వాగులు ఉదృతంగా ప్రవహించే కల్వర్టులు, మైనర్ బ్రిడ్జిల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తాత్కాలిక రిపేర్లు పూర్తి అయ్యేలోగా ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనల శాశ్వత రిపేర్ల కోసం ప్రపోజల్స్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ హెడ్ ఆఫీస్‌లో కంట్రోల్ సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులపైనా మంత్రి ఆరా తీశారు.
స్టేట్ రోడ్స్ సీఈ మోహన్ నాయక్, ఆధ్వర్యంలో షిఫ్ట్‌కు నలుగురు చొప్పున 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మంత్రి గత రివ్యూలో ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్‌అండ్‌బీ డివిజన్ల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, 24 గంటలు అలర్ట్‌గా ఉంటున్నామని స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు అధిక వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తూ..పరిస్థితులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని, ఏ రోజుకారోజు వివరాలు ఉదయం, సాయంత్రం తనకు రిపోర్ట్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు.