- ఈ నెల 9 నుంచి 14 వరకు బస్సుల్లో 2.40 కోట్ల మంది ప్రయాణం
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9 నుంచి 14 వరకు తెలంగాణ ఆర్టీసీ 6 వేల స్పెషల్ బస్సులు నడిపింది. హైదరాబాద్ నుంచి ఏపీ, ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరు రోజుల పాటు సుమారు 2 కోట్ల 40 లక్షల మంది ప్రయాణించారు. తద్వారా సుమారు. రూ. 100 కోట్ల వరకు ఆర్టీసీకి ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. ఈసారి సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ కు బస్సులు నడపలేదు. గతేడాది ఏపీ నుంచి తెలంగాణకు 2,540 బస్సులు నడపగా, ఈసారి 200 బస్సులకే పరిమితమైంది.
దీంతో గతేడాది ఏపీకి 5,400 బస్సులు నడిపిన టీజీఆర్టీసీ ఈసారి 6, 431 బస్సులు నడిపింది. అంటే, గతేడాది కన్నా వెయ్యికి పైగా అదనపు బస్సులు నడపడం విశేషం. దీని ద్వారానే ఈసారి ఆదాయం పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లినవారు ఆది, సోమవారాల్లో పెద్దసంఖ్యలో తిరిగి రానున్నారు. దీంతో ఈ నెల 18, 19 తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కాగా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులను నడిపిన సిబ్బందిని యాజమాన్యం ఒక ప్రకటనలో అభినందించింది.
