- ఏటా 6,169 టన్నుల కాలుష్య నివారణ
- సమాచారం కోరిన ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ
హైదరాబాద్, వెలుగు: ప్రయాణికులు, సిబ్బంది భద్రతతో పాటు ఇంధన పొదుపు లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ ప్రవేశపెట్టిన 'ఐ -అలర్ట్' టెక్నాలజీ సత్ఫలితాలను ఇస్తోంది. బీఎస్-6 బస్సుల్లో ఈ వ్యవస్థను అమలు చేసి దేశంలోనే తొలి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రికార్డు సృష్టించింది. 1,500 అశోక్ లేలాండ్ బీఎస్-6 బస్సుల్లో ఈ పరికరాలను అమర్చడం ద్వారా ఇప్పటివరకు రూ.36 కోట్ల విలువైన హై-స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ) ఆదా అయ్యిందని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది.
దీనివల్ల నెలకు అంచనా ప్రకారం సుమారు రూ. 2 కోట్లు ఆదా అవుతోందని వివరించింది. ఐ-అలర్ట్ వినియోగంతో రోజుకు 6,603 లీటర్లు, నెలకు 1,98,090 లీటర్ల డీజిల్ ఆదా అవుతోంది. ప్రతి లీటరు డీజిల్‌కు సుమారు 2.56 కిలోల కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయని అంచనా వేయగా, ఈ పొదుపు ద్వారా రోజుకు 16,904 కిలోలు (సుమారు 16.90 టన్నులు), నెలకు 507.11 టన్నులు, ఏడాదికి ఏకంగా 6,169.84 టన్నుల సీఓ2 వ్యర్థాలు తగ్గుతున్నాయని తెలిపింది.
డ్రైవర్ల పనితీరుకు గ్రేడింగ్స్
ఈ వ్యవస్థ డ్రైవింగ్ విధానాలను నిరంతరం గమనిస్తూ డ్రైవర్ల పనితీరును అంచనా వేస్తుంది. సరైన గేర్ల ఎంపిక, గ్రీన్ బ్యాండ్ ఆర్పీఎం పరిధిలో డ్రైవింగ్, ఎకానమీ గేర్ల వాడకం, అనవసరంగా ఇంజిన్ ఐడ్లింగ్ తగ్గించడం, ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యంగా బ్రేకుల వాడకం వంటి అంశాలను ఇది పర్యవేక్షిస్తుందని వివరించింది.
డ్యూటీ అనంతరం డ్రైవర్ నైపుణ్యాన్ని అంచనా వేసి గ్రేడింగ్స్ ఇవ్వడంతోపాటు శాస్త్రీయ ఇంధన పొదుపు డ్రైవింగ్ పద్ధతులపై మార్గదర్శకాలు అందిస్తున్నట్లు తెలిపింది. కాగా, టీజీఎస్ఆర్టీసీ అమలు చేస్తున్న ఐ-అలర్ట్ టెక్నాలజీ పనితీరుకు సంబంధించిన సమాచారం కావాలని ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ అధికారులు కోరినట్లు సంస్థ వెల్లడించింది. సాంకేతికతను అందిపుచ్చుకున్న ఆర్టీసీ ఇంజినీరింగ్ విభాగాన్ని ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ అభినందించారు.
