
- ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ పై టీఆర్ఎస్ లీడర్లలో కలవరం
- 18 న కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందో లేదో?
- ఆగిపోయిన కేటీఆర్ రోడ్డు షోలు
- అడుగడుగునా నిలదీస్తున్న ఆర్టీసీ కార్మికులు
- జనంలోకి వెళ్లాలంటేనే భయపడుతున్న గులాబీ నేతలు
- మద్దతు వెనక్కి తీసుకునే దిశగా సీపీఐ
హుజూర్నగర్ ఉప ఎన్నికకు పట్టుమని పదిరోజుల టైం కూడా లేదు. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలిచితీరాలనుకుంటున్న టీఆర్ఎస్కు ఆర్టీసీ సమ్మె కునుకులేకుండా చేస్తోంది. ప్రభుత్వ తీరుపై వారం రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. హుజూర్నగర్లోనూ అడుగడుగునా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. త్వరలో రాష్ట్ర బంద్‌కు కూడా సిద్ధమవుతున్నారు. ఉప ఎన్నిక టైమ్‌లో ఈ వ్యతిరేకత అధికార పార్టీలో గుబులురేపుతోంది. గెలుపు ఓటముల మాట పక్కనబెడితే.. కనీసం ప్రచారం చేయడానికి కూడా గులాబీ పెద్దలు ముందుకు వెళ్లడం లేదు.
టీఆర్ఎస్ నేతల్లో అభ్యర్థిని ప్రకటించిన కొత్తలో ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. సెప్టెంబర్ 21న హుజూర్నగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన రోజే అందరికన్నా ముందు తన అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డిని అధికార పార్టీ ప్రకటించి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్‌నగర్‌లో గతంలో టీఆర్ఎస్ గెలిచిన దాఖలాలు లేవు. కానీ.. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుస్తామని మొదట్లో భారీగా ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మొన్నామధ్య సర్పంచ్‌లు మూకుమ్మడి నామినేషన్లకు సిద్ధమవడం ఆ పార్టీని కాస్త ఆందోళనకు గురిచేసింది. అయినా.. నియోజకవర్గంలో భారీగా పార్టీ నాయకులను టీఆర్ఎస్ అగ్రనేతలు రంగంలోకి దింపారు. కులాలు, మతాల వారీగా మొత్తం 80 మంది ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఆ ఇన్‌చార్జ్‌లకు ఊరూరా అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఊరిలో సర్వేల మీద సర్వేలు చేయిస్తూ వాటికి తగ్గట్టు ఆ ఇన్‌చార్జ్‌లు జనంలోకి వెళ్లడం మొదలుపెట్టారు. గెలిచి తీరుతామన్న సవాళ్లు కూడా విసిరారు. కానీ.. ఈ నెల 5 నుంచి ఆర్టీసీ సమ్మె మొదలవడంతో ఆ సవాళ్లు చల్లబడిపోయాయి. నాయకుల్లో జోష్ తగ్గిపోయింది. ప్రతి చోట ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు చేస్తుండటంతో ప్రచారానికి వెళ్తే అడ్డుకోవడం ఖాయమని టీఆర్ఎస్నేతలు వెనక్కి తగ్గుతున్నారు. మొదట్లో ఉత్సాహంగా ఉన్న మాట వాస్తవమని, ఇప్పుడు ఆ ఉత్సాహం కాదు కదా.. కనీసం జనంలోకి వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోందని అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నెల 21న ఉప ఎన్నిక జరుగనుండగా.. 19న సాయంత్రంతోనే ప్రచారం ముగుస్తుంది. ప్రచారానికి టైమ్తక్కువగా ఉందని, ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌తో జనంలోకి ఎలా వెళ్లాలో తెలియడం లేదని గులాబీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం సభ జరిగేనా?
ఈ నెల 18న సీఎం కేసీఆర్ కోసం బహిరంగ సభ నిర్వహించాలని మొదట్లో నిర్ణయించారు. హుజూర్ నగర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేసిందో ఆ సభ వేదికగా కేసీఆర్ లెక్కలతో చెప్పాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహించాలా.. వద్దా? అనేదానిపై పార్టీ నాయకులు ఊగిసలాడుతున్నారు. బహిరంగ సభలో ఆర్టీసీ కార్మికులు వచ్చి నినాదాలు చేస్తే ఎన్నికల ప్రచారం పక్కదారి పట్టే ప్రమాదం ఉందని ఓ సీనియర్ నేత చెప్పారు. ఈ నెల 18 లోపు సమ్మెకు పుల్ స్టాప్ పడితే బహిరంగ సభ ఉంటుందని.. లేకపోతే డౌటేనని ఆ నాయకుడు అన్నారు.
సీపీఐ యూటర్న్?
హజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతిచ్చిన సీపీఐ.. ఇప్పుడు పునరాలోచనలో పడింది. ఆర్టీసీ సమ్మెపై బుధవారం అఖిలపక్ష భేటీకి హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ముందు అందరూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్కు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. దీంతో పార్టీలో చర్చించి మద్దతుపై పునరాలోచన చేస్తామని చాడ అన్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల సీపీఐ మద్దతు ఉససంహరించుకునే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.
రోడ్‌షోకు బ్రేక్
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం మొత్తాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే తీసుకున్నారు. ఆయనే ఎన్నికల ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఈ నెల 4న కేటీఆర్ హుజూర్ నగర్ కు వెళ్లి రోడ్డు షో చేపట్టారు. ఇతర నాయకులతో మాట్లాడి పార్టీ విజయవకాశాలపై చర్చించారు. మళ్లీ ఈ నెల 10 (గురువారం),11 (శుక్రవారం) వరుసగా రోడ్డుషోలు జరపాలని అప్పట్లోనే నిర్ణయించారు. కానీ ఆ రోడ్డు షోలు రద్దయ్యాయి. ఈ సమాచారాన్ని బుధవారం హుజూర్ నగర్ నాయకులకు చేరవేశారు. కేటీఆర్ రోడ్డు షోలకు బ్రేక్ పడటానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెనే ప్రధాన కారణమని పార్టీలోని ఓ సీనియర్ నేత చెప్పారు. రోడ్డు షోలో కార్మికులు వచ్చి ఆందోళన చెస్తారన్న భయంతోనే రద్దు చేసి ఉండవచ్చని అన్నారు. ప్రచార సమయంలో కార్మికులు వచ్చి నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియదని, ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆర్టీసీ కార్మికులను మరింత రెచ్చగొట్టడమే అవుతుందని పేర్కొన్నారు. అందుకే కేటీఆర్ రోడ్డు షోలను రద్దు చేసుకున్నారని, ప్రచారంపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పారు. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలుస్తామని మొదట్లో కేటీఆర్ చెప్పారని, అయితే ఎంత మెజార్టీ వస్తుందో ఆయన చెప్పకపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఇంకా కాంగ్రెస్ కు పట్టు ఉండటమేనని మరో నేత అన్నారు.