కరీంనగర్‌‌ స్మార్ట్  సిటీకి మరో రూ.70 కోట్లు..విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

కరీంనగర్‌‌ స్మార్ట్  సిటీకి మరో రూ.70 కోట్లు..విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం 
  • స్టార్మ్  వాటర్  డ్రైనేజీ సిస్టం, 
  • మల్టీ లెవెల్  పార్కింగ్, సదాశివపల్లి జంక్షన్, స్పాంజ్  పార్క్  నిర్మాణానికి వినియోగం 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్  స్మార్ట్  సిటీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.70 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే స్మార్ట్  సిటీ గడువు ముగిసినప్పటికీ.. పెండింగ్  పనులు పూర్తి చేయడానికి అదనపు నిధులు కేటాయించింది. ఈ నిధులతో స్టార్మ్  వాటర్(వర్షపు నీరు) డ్రైనేజీ సిస్టం, మల్టీ లెవెల్  పార్కింగ్  సౌకర్యం, సదాశివపల్లి జంక్షన్, స్పాంజ్  పార్క్  అభివృద్ధి, మోడల్  శ్మశానవాటిక నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు పనులు చేయగల సమర్థవంతమైన కన్సల్టెన్సీల నుంచి ప్రపోజల్స్  ఆహ్వానించారు. 

చేపట్టే పనులు ఇవే..

  నగరంలో వర్షాకాలంలో తలెత్తే వరద సమస్యలకు చెక్  పెట్టేందుకు అధునాతన స్టార్మ్  వాటర్  డ్రైనేజీ సిస్టంను రూ.21.5 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులోభాగంగా ముందుగా సంబంధిత కన్సల్టెన్సీ ప్రస్తుత డ్రైనేజీ నెట్‌వర్క్‌ లోని లోపాలను గుర్తించడంతోపాటు గత కొన్నేళ్ల వర్షపాతం డేటాను సేకరిస్తారు. నగరవ్యాప్తంగా టోటల్  స్టేషన్  సర్వే ద్వారా క్యాచ్‌మెంట్  ఏరియాలను గుర్తించి, వరద నీరు సజావుగా సాగిపోయేలా ఆధునిక హైడ్రాలిక్  డ్రైన్లను డిజైన్  చేయాల్సి ఉంటుంది. 

 నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్, పార్కింగ్  ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా కరీంనగర్ లో మల్టీ లెవెల్  కార్  పార్కింగ్  సదుపాయం కోసం రూ.25 కోట్లు మంజూరు చేసింది. సంబంధిత కన్సల్టెన్సీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, పార్కింగ్  డిమాండ్‌ను అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్  కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసి, అక్కడ సాయిల్  టెస్టింగ్  నిర్వహించి బహుళ అంతస్తుల పార్కింగ్  కాంప్లెక్స్​ నిర్మిస్తారు.

కేబుల్  బ్రిడ్జి నుంచి హన్మకొండ వైపు వెళ్లే రోడ్డు, అలుగునూరు నుంచి హన్మకొండ వైపు వెళ్లే రోడ్డు, హన్మకొండ నుంచి కరీంనగర్  వచ్చే రోడ్డు సదాశివపల్లి జంక్షన్ లో కలుస్తున్నాయి. ఈ మూడు రోడ్ల కలయిక దగ్గర తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు సదాశివపల్లి జంక్షన్ ను రూ.3 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. సంబంధిత కన్సల్టెన్సీ ఇక్కడ ట్రాఫిక్  వాల్యూమ్  స్టడీ నిర్వహించి, రోడ్డు జ్యామిట్రీని సవరించాల్సి ఉంటుంది. సిగ్నలింగ్  వ్యవస్థ, రోడ్డు భద్రతా చర్యలతో పాటు పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ప్రత్యేక సౌలతులు కల్పిస్తారు. 

  నగరంలో పచ్చదనాన్ని, భూగర్భ జలాలను పెంచేందుకు సరికొత్తగా ఎకో ఫ్రెండ్లీ ‘స్పాంజ్  పార్క్’ను రూ.3 కోట్లతో డెవలప్​ చేయనున్నారు. ఇందులోభాగంగా వర్షపు నీళ్లు భూమిలోకి ఇంకేలా ప్రత్యేక వాటర్ రిటెన్షన్ ఫీచర్లు, అందమైన ల్యాండ్‌స్కేప్  ప్లాన్స్, వాకింగ్  పాత్‌వేస్, ఇతర మౌలిక వసతులను డిజైన్  చేయాల్సి ఉంటుంది.

   అంతిమ సంస్కారం కూడా సౌకర్యవంతంగా ఉండేలా మోడల్  శ్మశానవాటికను రూ.2.50 కోట్లతో అభివృద్ధి  చేయనున్నారు. ప్రజల సౌకర్యార్థం శ్మశానవాటికను అన్ని రకాల సౌలతులతో ఆధునీకరించనున్నారు. సమగ్ర లేఅవుట్  ప్లాన్‌ను రెడీ చేసి ఇంటర్నల్  రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నిరంతర నీటి సరఫరా, లైటింగ్ తో పాటు ఇతర వసతులను ఏర్పాటు చేస్తారు.  

కన్సల్టెన్సీ పేరిట రూ.కోటిన్నర వృథా!

కరీంనగర్  స్మార్ట్  సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.70 కోట్లతో చేపట్టే పనుల కోసం సర్వేలు, ఇన్వెస్టిగేషన్లు, ప్లానింగ్, డీటెయిల్డ్  ప్రాజెక్ట్  రిపోర్ట్స్  తయారీ కోసం కన్సల్టెంట్స్ ను ఆహ్వానిస్తూ మున్సిపల్  కార్పొరేషన్  నోటిఫికేషన్  రిలీజ్  చేసింది. ఎంపికైన కన్సల్టెన్సీకి డీపీఆర్  తయారీ కోసం సుమారు కోటిన్నర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపాదించిన 5 పనుల్లో ఒకటి మినహా నాలుగు పనులు గత స్మార్ట్  సిటీ కన్సల్టెన్సీ రూపొందించిన డీపీఆర్ లో ఉన్నవే. ఆ డీపీఆర్  ఆధారంగా ముందుకెళ్లే అవకాశమున్నా మళ్లీ కొత్త కన్సల్టెన్సీని ఎందుకు ఆహ్వానించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందల కోట్ల పనులు ఉన్నప్పుడు కన్సల్టెన్సీ అవసరమని, మున్సిపాలిటీలో లక్షల్లో జీతం తీసుకుంటున్న అనుభవజ్ఞులైన ఇంజనీర్లు ఉన్నప్పటికీ కన్సల్టెన్సీ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది.