పల్లె ప్రగతికి పైసా ఇయ్యలే!

పల్లె ప్రగతికి పైసా ఇయ్యలే!
  • సర్కారు ఇచ్చిన రూ.64 కోట్లు కలెక్టర్లు, మంత్రుల దగ్గరే
  • సర్పంచులు, కౌన్సిలర్లకు మళ్లీ ఉత్త చేతులే
  • ముందుగా ఖర్చు చేసి బిల్లులు పెట్టుకోవాలంటున్న ఆఫీసర్లు
  • పనులు చేయకుంటే నోటీసులు, సస్పెన్షన్లు
  • ఏడాదిగా పాత బిల్లులు రాక పుట్టెడు కష్టాలు
  • మళ్లీ కొత్త అప్పులకు తిరుగుతున్న సర్పంచులు

వరంగల్‍ రూరల్, వెలుగు: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని.. పల్లెలు, పట్టణాల రూపురేఖలు పూర్తిగా మార్చేయాలని ఆదేశాలిచ్చిన రాష్ట్ర సర్కారు.. అందుకు కావాల్సిన నిధులు మాత్రం రిలీజ్ చేయలేదు. హైదరాబాద్ మినహాయించి 32 జిల్లాల కలెక్టర్లకు రూ.కోటి చొప్పున రూ.32 కోట్లు, ఒక్కో మంత్రి వద్ద రూ.2 కోట్లు కలిపి మొత్తం రూ.64 కోట్లు అందుబాటులో ఉంచామని పంచాయతీశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పినా.. ఏ ఒక్క సర్పంచ్​కూ ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ఆఫీసర్లను అడిగితే.. ‘‘అందుబాటులో ఉన్న ఎస్ఎఫ్‌సీ, 15వ ఫైనాన్స్ కమిషన్​ ఫండ్స్ వాడుకోండి. తర్వాత బిల్లులు పెట్టుకోండి” అని చెబుతున్నారని సర్పంచులు అంటున్నారు. ఆ ఫండ్స్ పాత అప్పులపై మిత్తీలకు, రెగ్యులర్‍ శానిటేషన్‍, కరెంట్‍ బిల్లులు, ట్రాక్టర్‍ ఈఎంఐ, సిబ్బంది శాలరీస్​కే ఖర్చయ్యాయని, కొత్తగా పల్లె ప్రగతి పనులకు మరోసారి అప్పులు తేవాల్సి వస్తోందని వాపోతున్నారు. పైసా ఇయ్యకుండా పనులు చేయమంటున్నారని, చేయకుంటే నోటీసులు, సస్పెన్షన్ ​అని బెదిరిస్తున్నారని సర్పంచులు, కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోసారి అప్పులపాలు

జనాభా ఆధారంగా ఏడాదికి ఒక్కో మనిషికి రూ.1,600 చొప్పున గ్రామ పంచాయతీ (జీపీ)లకు ఫండ్స్ వస్తుంటాయి. ఈ లెక్కన 500 జనాభా ఉండే జీపీకి ఏడాదికి గరిష్టంగా వచ్చేది రూ.8 లక్షలు. కానీ ప్రస్తుత పల్లె ప్రగతి కింద ప్రభుత్వం చెబుతున్న పనులన్నీ చేయాలంటే.. కనీసం రూ.10 లక్షలు అవసరమని సర్పంచులు అంటున్నారు. ప్రతి నెల వచ్చే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్​ఎఫ్​సీ), 15 ఫైనాన్స్ ఫండ్స్.. రెగ్యులర్‌‌‌‌గా ఉండే అవసరాలకే సరిపోతున్నాయి. పెండింగ్‍లో ఉన్న వైకుంఠ ధామాలు,  సెగ్రిగేషన్ ​షెడ్లు పూర్తి చేయాలి. మట్టి రోడ్లు ఉన్న చోట్ల, గతంలో వేసి డ్యామేజీ అయిన చోట్ల సీసీరోడ్లు వేయాలి. డ్రైనేజీల్లో పూడికతీత, కంపోస్ట్​ ఎరువుల తయారీ, దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, వంగిన, తుప్పుపట్టిన కరెంట్‍ పోల్స్ ను మార్చడం, స్కూళ్లు, అంగన్‌‌వాడీ సెంటర్లు, మార్కెట్లు, బస్టాండ్లలో పారిశుధ్య కార్యక్రమాలు, వాటర్‍ ట్యాంకుల క్లీనింగ్‍ ఇలా పది రోజుల్లో చేపట్టాల్సిన పనుల లిస్టు చాంతాడంత ఉంది. ఇవి గాక హరితహారం కింద నర్సరీల నుంచి మొక్కలు తెప్పించడం, నాటించడం లాంటి పనులకూ ఖర్చు తడిసిమోపెడవుతోంది. రోడ్ల పక్కన చిన్న మొక్కలు నాటితే బతకడం లేదు. ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం ఏపీ నుంచి పెద్ద మొక్కలు తెప్పించాల్సి వస్తోంది. గతంలో రూ.60కి వచ్చిన మొక్కకు ఇప్పుడు రూ.100కుపైగా తీసుకుంటున్నారు. వీటిని కాపాడేందుకు ఏర్పాటు చేసే ట్రీగార్డుల బండిల్ గతంలో రూ.2 వేలకు దొరికితే ఇప్పుడు 3 వేలకు పెరిగింది. ఖర్చు లక్షలు అవుతుండడంతో సర్పంచులు దొరికినకాడల్లా అప్పులు చేస్తున్నారు.

వార్నింగులు.. సస్పెన్షన్లు..

పల్లె, పట్టణ ప్రగతి కోసం రూపాయి కూడా కేటాయించని ప్రభుత్వం.. పనులు జరగని చోట్ల సర్పంచులకు, కౌన్సిలర్లకు ఆఫీసర్లతో వార్నింగులు ఇప్పిస్తోంది. జిల్లాల కలెక్టర్లు.. సర్పంచులపై సస్పెన్షన్లు విధిస్తున్నారు. దీనిపై గతంలో ఎమ్మెల్యేలు, మంత్రుల ఎదుట సర్పంచులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అప్పు చేసి పనులు చేస్తున్న తమను ఆఫీసర్లు వేధించడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీశారు. పాత బిల్లులు పూర్తిగా రాకముందే మళ్లీ పల్లె, పట్టణ ప్రగతి పనులు మొదలుకావడం, ఈసారి అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉండడంతో తలపట్టుకుంటున్నారు.

గతేడాది బిల్లులు ఇంకా పెండింగ్‌‌లోనే
గతేడాది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల కోసం సర్పంచులు రూ.లక్షల అప్పు తీసుకువచ్చి పనులు చేశారు. తర్వాత బిల్లుల కోసం చెప్పులరిగేలా తిరిగారు. ఈలోగా ఈ ఏడాది జులై 1 నుంచి ప్రభుత్వం నాలుగో విడత  పల్లెప్రగతి ప్రారంభించింది. ఈక్రమంలో రాష్ట్ర సర్కారు హడవుడిగా 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు స్థానిక సంస్థలకు రూ.273 కోట్లు రిలీజ్‍ చేసింది. జీపీలకు 232.06 కోట్లు, మండల ప్రజాపరిషత్‍లకు రూ.27.28 కోట్లు, జిల్లా ప్రజాపరిషత్‍లకు రూ.13.63 కోట్లు ఇచ్చింది. దీంతో సర్పంచులు 2020 పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామాలు, డంపింగ్‍ యార్డులు, విలేజ్​పార్కుల కోసం తమ జేబులోంచి ఖర్చు చేసిన పైసల్లో కొంత మేర ఇవ్వగలిగినా, ఇంకా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది సర్పంచుల బిల్లులు పెండింగ్‍లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

మిత్తీలు కట్టలేకపోతున్నం
పల్లె ప్రగతి పనులు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, ఆ ఫీసర్లు ఒత్తిడి చేస్తున్నారు. ఇదివరకు చేసిన పనులకే బిల్లులు రాలేదు. గతేడాది చేసిన అప్పులకు మిత్తీలు కట్టలేక ఇబ్బందులు పడ్తున్నం. ఈసారి పల్లె ప్రగతి కోసమని ఫండ్స్ ఇవ్వట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పనుల కోసం మళ్లీ అప్పులు చేస్తున్నం.
- వల్లెపు అనిత, విశ్వనాథకాలనీ సర్పంచ్, వరంగల్‍

రూ.12 లక్షలు అయితంది

పల్లె ప్రగతికి గవర్నమెంట్ స్పెషల్‍ ఫండ్స్ ఏమీ ఇవ్వలేదు. పది రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముధోల్ పరిధిలో రూ.12 లక్షలు ఖర్చు అవుతోంది. సెంట్రల్, పాత ఫండ్స్ తోనే ఖర్చు చేసుకోవాలని సర్కారు చెబుతోంది. కానీ మా పంచాయతీలో అంత ఫండ్ లేదు. మిగతా భారం మాపైనే పడుతోంది.

- రాజేందర్, సర్పంచ్, ముధోల్