- తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: రైతులకు అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్‌లో విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఎఫ్‌పీవోలు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా రైతులతో అనుసంధానమై వారి ద్వారానే విత్తన ఉత్పత్తి చేపడుతోందన్నారు. సేకరించిన విత్తనాలను పరీక్షల అనంతరం ధ్రువీకరించి రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
సమృద్ధిగా విత్తనాలు..
వానకాలం సీజన్‌కు అవసరమైన విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని అన్వేష్‌రెడ్డి చెప్పారు. సన్న రకాలైన బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్–15048, కేఎన్‌ఎం–1638తో పాటు దొడ్డు రకాలైన కేఎన్‌ఎం–118, ఎమ్‌టీయూ–1010 విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం సూచించిన రకాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఆదేశించారు. మెదక్ జిల్లాలో ఈ సీజన్‌లో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా వేస్తున్నామని, ఇందుకు 82 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమన్నారు. అందులో కనీసం 40 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్, డీసీఎస్‌వో నిత్యానందం, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

