- జీహెచ్‌ఎంసీ పరిధిలో తక్షణం ఖాళీ చేయాలంటూ సీఎస్ ఆదేశాలు
- హౌసింగ్ బోర్డు కాంప్లెక్స్‌లు,
- టీ హబ్, గృహకల్ప, గగన్ విహార్‌లకు షిఫ్టింగ్
- ఆర్ అండ్ బీ నివేదిక ఆధారంగా చర్యలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పొదుపు చర్యల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని సుమారు 39 ఆఫీసులను తక్షణం ఆయా ప్రైవేటు భవనాల నుంచి ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సీఎస్ రామకృష్ణారావు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని చీఫ్ ఇంజనీర్ (ఆర్‌అండ్‌బీ) సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అద్దెల రూపంలో వృథా అవుతున్న ప్రజాధనాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.
అద్దె భవనాల నుంచి ప్రభుత్వ భవనాల్లోకి మారనున్న జాబితాలో ఇంధన శాఖ, పర్యావరణం, అటవీ శాఖ, రెవెన్యూ (ఎండోమెంట్స్, కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్), పౌర సరఫరాల శాఖ, యువజన సర్వీసులు, ఆర్థిక శాఖ, మైనారిటీ వెల్ఫేర్, ఐటీ, రవాణా శాఖలకు సంబంధించిన పలు కార్యాలయాలు ఉన్నాయి. హయత్‌నగర్, బైరామల్‌గూడ, బోవరంపేటలోని విద్యుత్ శాఖ ఆఫీసులను, రామచంద్రాపురంలో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీస్, ల్యాబ్‌లను మొజాంజాహి మార్కెట్‌లోని తుల్జా గూడా కాంప్లెక్స్‌కు, ఎర్రమంజిల్‌లోని పాత ఆర్‌అండ్‌బీ ఆఫీసు భవనంలోకి మారుస్తున్నారు. బర్కత్‌పురాలో ఉన్న తెలంగాణ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ కార్యాలయాన్ని కూడా మొజాంజాహి మార్కెట్‌లోని హౌసింగ్ బోర్డు కాంప్లెక్స్‌లో కేటాయించిన స్థలంలోకి మార్చనున్నారు.
హౌసింగ్ బోర్డు భవనాలే కొత్త వేదికలు
ప్రైవేటు భవనాల నుంచి ఖాళీ చేయిస్తున్న కార్యాలయాల్లో అత్యధిక శాతం కార్యాలయాలను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు చెందిన ఖాళీ భవనాల్లో సర్దుబాటు చేశారు. ఉదాహరణకు సికింద్రాబాద్‌లో ఉన్న ఎన్‌సీసీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్, బెటాలియన్ ఆఫీసులను నాంపల్లి ఎంజే రోడ్‌లోని చంద్ర విహార్ భవనంలోకి తరలిస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ కు చెందిన పంజాగుట్ట, సికింద్రాబాద్ డివిజన్ల కార్యాలయాలను నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్‌కు షిఫ్ట్ చేస్తున్నారు. పురానీ హవేలీలో ఉన్న సెట్‌విన్ కార్యాలయాన్ని నాంపల్లిలోని గగన్ విహార్ భవనానికి మార్చనున్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖకు సంబంధించిన ఎన్‌సీసీ యూనిట్లను సికింద్రాబాద్ నుంచి చంద్ర విహార్‌లోని వివిధ అంతస్తుల్లోకి మార్చడం ద్వారా ప్రభుత్వ భవనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది.
ఆర్థిక శాఖ పరిధిలోని అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ కార్యాలయాల చిరునామాలు కూడా మారనున్నాయి. ప్రస్తుతం తార్నాక, చాంద్రాయణగుట్ట, నారాయణగూడ, మోతీగల్లీ వంటి వేర్వేరు ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న పెన్షన్ పేమెంట్ ఆఫీసులన్నింటినీ నాంపల్లిలోని గాంధీ భవన్ పక్కన ఉన్న ‘గృహకల్ప’ కాంప్లెక్స్‌లోకి తరలించనున్నారు. మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి నాంపల్లిలో ఉన్న తెలంగాణ స్టేట్ మైనారిటీస్ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్‌ను బషీర్‌బాగ్ లోని షక్కర్ భవన్ బిల్డింగ్‌లోకి మారుస్తున్నారు.
టీ హబ్, కేపీహెచ్‌బీ కాంప్లెక్స్‌లకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు
ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలను కూడా అద్దె భవనాల నుంచి మారుస్తున్నారు. వట్టినాగులపల్లి, నార్సింగిలలో ఉన్న శేరిలింగంపల్లి, గండిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను, అలాగే రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసును రాయదుర్గం పన్మక్తలోని టీ-హబ్ భవనంలోకి తరలించనున్నారు. ఇక కుకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కేపీహెచ్‌బీ ఫేజ్-1లోని కమర్షియల్ కాంప్లెక్స్‌లోకి మారుస్తున్నారు. ఎస్‌ఆర్ నగర్, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను వెంగళరావు నగర్‌లోని మెడికల్ డిపార్ట్‌మెంట్ క్వార్టర్స్‌కు షిఫ్ట్ చేస్తున్నారు. ఐటీ శాఖకు చెందిన ఫైబర్ నెట్ కార్యాలయాన్ని హైటెక్ సిటీలోని నాక్ క్యాంపస్‌కు తరలించనున్నారు.
