 
                                    - ఎగుమతులే లక్ష్యంగా పలు వరి రకాల ప్రదర్శన
- బియ్యం ఎగుమతి పెరిగితే రైతులకు మేలు: స్టీఫెన్ రవీంద్ర
న్యూఢిల్లీ, వెలుగు: భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ బియ్యం ఎగుమతి సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ను పెద్ద సంఖ్యలో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. భారత్ మండపం వేదికగా జరుగుతున్న భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ గురువారం ప్రారంభమైంది.
ఈ కాన్పరెన్స్ లో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. 14 వ నంబర్ లోని రాష్ట్ర స్టాల్ లో.. ఎంటీయూ 1010, ఆర్ఎన్ఆర్ 15048, బీపీటీ 5204, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 118 - జై శ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, చిట్టిముత్యాలు వంటి ప్రీమియం రకాల బియ్యం సాంపిళ్లను ప్రదర్శనకు పెట్టారు.
కువైట్, ఆఫ్రికా దేశాల ప్రతినిధి ఎన్‌సీఈఎల్ ఎండీ ఉనుపోమ్ కౌసిక్, ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ప్రేమ్ గార్గ్, పలువురు స్వదేశానికి బియ్యం ఎగుమతిదారులు రాష్ట్ర స్టాల్‌ను సందర్శించారు. తెలంగాణలో పండించే బియ్యాన్ని ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తున్నట్లు తెలంగాణ ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్, స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
అలాగే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. బియ్యం ఎగుమతి పెరిగితే.. తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందన్నారు. విదేశీ ప్రతినిధులు వరి రకాలను పరిశీలించారని చెప్పారు.

 
         
                     
                     
                    