కుల గణనకు ప్రభుత్వం రూ.150 కోట్లిచ్చింది

కుల గణనకు ప్రభుత్వం రూ.150 కోట్లిచ్చింది
  • జనాభా లెక్కల ఆధారంగానే నిర్ణయాలుంటయ్
  • సుప్రీంలో తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కుమార్ వాదనలు

న్యూఢిల్లీ, వెలుగు : కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయించిందని తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కుమార్ సుప్రీంకోర్టుకు తెలిపారు. జనాభా లెక్కల ఆధారంగా ఆయా వర్గాలకు సంబంధించిన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.రాష్ట్ర విభజన అనంతరం ఆనాటి తెలంగాణ సర్కార్ కొప్పుల, వెలమ, శెట్టి బలిజ సహా దాదాపు 28 వెనకబడిన కులాల రిజర్వేషన్లను తొలగించింది. దాంతో  ఆయా వర్గాలకు చెందిన పలువురు 2015 లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను జస్టిస్‌‌ సుధాంశు ధులియా, జస్టిస్‌‌  ప్రసన్న బాలచంద్ర వరాలేలతో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది.

తొలుత జస్టిస్‌‌ సుధాంశు ధులియా జోక్యం చేసుకొని.. ఈ కేసు ఓబీసీలకు సంబంధించినదా? తెలంగాణానా? ఆంధ్రప్రదేకా? అని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన ఓబీసీల కేసు అని, విభజన తర్వాత పలు కులాలను ఓబీసీల నుంచి తప్పించారని పిటిషనర్‌‌ తరఫు అడ్వకేట్ బెంచ్ కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది శ్రావణ్‌‌ కుమార్‌‌ వాదనలు వినిపిస్తూ... ‘ఇటీవల తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కుల గణన కోసం (కాస్ట్ బేస్డ్ సెన్సెస్) రూ.150 కోట్లు కేటాయించింది. ఆరు నెలల్లో రిపోర్టు వస్తుంది.

ఆ రిపోర్ట్ ఆధారంగా కచ్చితంగా ఆయా వర్గాల విషయంలో నిర్ణయం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ కమిషన్ అఫిడవిట్ దాఖలు చేసింది’ అని బెంచ్ కు నివేదించారు.  వాదనలపై స్పందించిన ధర్మాసనం... అంతవరకూ వేచిచూడలేమని, ఇది తొలిసారి కాదని పేర్కొంది. పంకజ్ కుమార్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసులో ఇదే పరిస్థితి నెలకొందని పిటిషనర్ తరపు న్యాయవాది బెంచ్ దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్లపై విచారణను నాన్‌‌ మిస్‌‌ లీనియస్‌‌ రోజున విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న బెంచ్ తదుపరి విచారణను ఏప్రిల్‌‌3కు చేపడతామని వెల్లడించింది.