గ్రేటర్ నోయిడా: తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. నేషనల్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన విమెన్స్ 51 కేజీ సెమీస్‌లో నిఖత్ 4–1తో కుసుమ్ బాగెల్ (యూపీ)పై గెలిచింది. స్టార్టింగ్ నుంచే వ్యూహాత్మకంగా పంచ్‌లు విసిరిన తెలంగాణ బాక్సర్ వరుసగా పాయింట్లు రాబట్టింది. హుక్స్, అప్పర్ కట్స్‌తో బౌట్‌ను ఏకపక్షంగా మార్చేసింది. మరో సెమీస్‌లో నీతూ గంగాస్ 4–0తో జ్యోతి (రైల్వేస్)పై నెగ్గి.. నిఖత్‌తో గోల్డ్ మెడల్ బౌట్‌కు రెడీ అయ్యింది. వరల్డ్ చాంపియన్ మీనాక్షి హుడా (48 కేజీ) 5–0తో మాలిక మోర్‌పై, లవ్లీనా బోర్గోహైన్ (75 కేజీ) 5–0తో ఇమ్రోజ్ ఖాన్ (యూపీ)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. మెన్స్ సెమీస్‌లో మహ్మద్ హుస్సాముద్దీన్ (60 కేజీ), అభినాశ్ జమ్వాల్ (65 కేజీ), జాదుమణి సింగ్ (55 కేజీ), పవన్ బర్తాల్ (55 కేజీ), విక్టర్ సింగ్ (మణిపూర్) తమ ప్రత్యర్థులపై గెలిచి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించారు.
