అక్టోబర్ నుంచి సోయా కొనుగోళ్లు 42 సెంటర్లు ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్

 అక్టోబర్  నుంచి సోయా కొనుగోళ్లు 42 సెంటర్లు ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్
  • రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని 3.66 లక్షల ఎకరాల్లో సోయా సాగు
  • 2.79 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా
  • రూ.827.99 కోట్లతో 1.39 లక్షల టన్నులు కొనాలని టార్గెట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలంలో రైతులు పండించిన సోయా పంట కొనుగోళ్లు బుధవారం నుంచి షురూ కానున్నాయి. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉన్న రైతాంగం జోరుగా సోయా పంట తీస్తున్నరు. నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్​సంస్థ చేపట్టే సోయా సేకరణకు రాష్ట్ర మార్కెటింగ్​శాఖ, అగ్రికల్చర్​ శాఖలు సహకరించనున్నాయి. 

రాష్ట్రంలో సోయా పంట కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశంతో మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో సోయా పంట కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 12జిల్లాల్లోని 42 కొనుగోలు సెంటర్ల ద్వారా పంట కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.  

క్వింటాల్​కు రూ.5328 మద్దతు ధర

బుధవారం నుంచి రాష్ట్రంలో సోయా కొనుగోళ్లు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్​ఫెడ్​ ద్వారా  ఏర్పాట్లు పూర్తి చేసింది.రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 3.66లక్షల ఎకరాల్లో రైతులు సోయా పంటను  సాగుచేయగా..ఈయేడు పంట దిగుబడి 2.62లక్షల టన్నుల సోయా ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ  అంచనా వేసింది. ఇందులో 50శాతం పంట కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ నేపథ్యంలో 42 సెంటర్ల ద్వారా మద్దతు ధర రూ.5328 క్వింటాల్​ చొప్పున రూ.827.99 కోట్లు విలువైన 1.39 లక్షల టన్నుల పంట కొనుగోళ్లకు మార్క్​ఫెడ్​ ఏర్పాట్లు పూర్తి చేసింది.

నిర్మల్​ జిల్లాలో  అత్యధికం

సోయా అత్యధికంగా 1.11లక్షల ఎకరాల్లో సాగైన నిర్మల్​ జిల్లాలో 10 సెంటర్లు, 85వేల ఎకరాల్లో పంట సాగైన కామారెడ్డి జిల్లాలో 10 సెంటర్లు ప్రారంభిస్తారు. 69వేల ఎకరాల్లో సాగైన సంగారెడ్డిలో 3సెంటర్లు, 60వేల ఎకరాల్లో పంట సాగైన ఆదిలాబాద్​ జిల్లో 10 సెంటర్లు తెరవనున్నారు. అదే విధంగా 33వేల ఎకరాల్లో సోయా సాగైన నిజామాబాద్​ జిల్లాలో 7 సెంటర్లు, ఆసిఫాబాద్​ జిల్లాలో , జగిత్యాల జిల్లాలో ఒక్కో సెంటర్​ ప్రారంభించనున్నారు. 

25 శాతం పంట కొనుగోళ్లకు  కేంద్రం అనుమతి 

రాష్ట్రంలో సోయా దిగుబడిలో  25 శాతం పంట కొనుగోళ్లకు కేంద్రం అనుమతి లభించింది.  పంట కొనుగోళ్లపై తాజాగా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్​ చౌహాన్ పలువురు మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫారెన్స్​లో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కనీసం 50శాతం పంట కొనుగోళ్లకు అనుమతించాలని  కోరారు. మిగతా రాష్ట్రాల్లో 25శాతం పంట రాకపోతే ఆ లోటు భర్తీ చేసేందుకు  తెలంగాణలో కొనుగోలుకు అనుమతిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.  

మద్దతు ధరకే కొంటంరాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో రాష్ట్రంలో బుధవారం నుంచి సోయా కొనుగోళ్లకు  ఏర్పాట్లు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 12జిల్లాల్లో 42 సెంటర్లు తెరిచి మద్దతు ధరతో సోయా కొనుగోళ్లు చేపడుతున్నాం.– శ్రీనివాస్​ రెడ్డి, ఎండీ, మార్క్​ఫెడ్