హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్) తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 డీసీసీ బ్యాంకుల నుంచి రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలతో లిస్ట్ తయారు చేసి, డేటాను వ్యవసాయ శాఖకు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. 30 వేల రైతుల అకౌంట్లకు సంబంధించి ఆధార్, రైతుల వివరాల్లో లోపాలను గుర్తించామని, దీనిని టెస్కాబ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని తెలిపారు.
రుణమాఫీ పోర్టల్లో, డీసీసీబీల్లో ఆధార్ సవరణలు చేసి సమస్యను సరిదిద్దుతున్నట్లు తెలిపారు. 157 ప్యాక్స్‌లకు సంబంధించి 3,983 రైతుల అకౌంట్లు పంట రుణాల పంపిణీ వ్యవస్థలో నమోదు కాలేదన్నారు. మిస్సింగ్ డేటాకు బాధ్యులైన ప్యాక్స్ సెక్రటరీలు, డీసీసీ బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రుణమాఫీ తొలివిడతలో ప్యాక్స్‌కు జులై 18న రూ.900 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అధికారులు వెల్లడించారు.
9 జిల్లాల్లోని డీసీసీ బ్యాంకుల 376 బ్రాంచ్‌ల మేనేజర్లకు ఈ మాఫీ నిధులు అందించామన్నారు. రెండో దశలో జులై 30న మరో రూ.678 కోట్లు రుణమాఫీ నిధులను సర్కార్ విడుదల చేసిందన్నారు. రెండు విడుతల్లో మొత్తం రూ.1,578 కోట్లు విడుదల కాగా, కోఆపరేటివ్ బ్యాంకుల్లోని రైతుల అకౌంట్లకు ఫాలో ఆఫ్ క్రెడిట్ అందించామని వివరించారు.
