V6 News

మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు.. ఈ నెల  ఏప్రిల్ 15 నుంచి ‘దోస్త్’ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు

మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు.. ఈ నెల  ఏప్రిల్ 15 నుంచి ‘దోస్త్’ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
  • జులై 1 నుంచి     ఫస్ట్ సెమిస్టర్ క్లాసులు
  • షెడ్యూల్ రిలీజ్ చేసిన టీజీసీహెచ్​ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సారి మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ చేపడతామని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) ప్రకటించింది. సోమవారం హైదరాబాద్ లో టీజీసీహెచ్​ఈ వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు రాజేందర్ సింగ్, బాలభాస్కర్ తో కలిసి టీజీసీహెచ్‌ఈ చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి.. దోస్త్ –2026 షెడ్యూల్‌ను ప్రకటించారు. డిగ్రీ ఫస్టియర్​లో ప్రవేశాల కోసం ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఇంటర్ పాసైన విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్ (https://dost.cgg.gov.in) ద్వారా తమకు నచ్చిన కోర్సుల్లో చేరవచ్చని సూచించారు.

దోస్త్ ద్వారా స్టేట్ లోని ఉస్మానియా వర్సిటీతో పాటు కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం తదితర కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు. స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఆధ్వర్యంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డీ– ఫార్మసీ కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు 909 ఉండగా, వాటిలో 4,01,521 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో 79 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఉండగా, వాటిలో  23,654 సీట్లున్నాయి. అయితే, రెసిడెన్షియల్ కాలేజీల్లో ఆయా సొసైటీలే ప్రవేశాలు నిర్వహిస్తుంటాయి. 

మూడు ఫేజ్ లలో కౌన్సెలింగ్..

తొలి విడత రిజిస్ట్రేషన్లు ఈ నెల 15 నుంచి మే 7 వరకు కొనసాగుతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు ఈ నెల 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మే 14న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో విడత మే15 నుంచి 25 వరకు, మూడో విడత మే 31 నుంచి జూన్ 15 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. మొదటి విడతలో రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 200 కాగా, రెండు, మూడు విడతల్లో రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 మధ్య ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30 తేదీల్లో విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తారు. జులై 1వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్ క్లాసులు ప్రారంభమవుతాయి.

దోస్త్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్లు.. 

విద్యార్థులు ఎవరి సాయం లేకుండానే స్మార్ట్‌ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా దోస్త్ యాప్‌ను టీజీసీహెచ్​ఈ అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు ఆధార్ నంబర్ ద్వారా లేదా ‘ఫేషియల్ రికగ్నిషన్’ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం 79010 02200 నంబర్ తో వాట్సాప్ చాట్‌బాట్ సౌకర్యాన్ని కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు బాలకిష్టారెడ్డి తెలిపారు. అలాగే, దోస్త్ హెల్ప్ డెస్క్ నంబర్ (040 23120416) ను సంప్రదించవచ్చని సూచించారు.  

దోస్త్ షెడ్యూల్ ఇలా.. 

ఫస్ట్ ఫేజ్:
ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్‌ ఆప్షన్లు 
మే 14న మెుదటి ఫేజ్‌ సీట్ల కేటాయింపు
మే 23 వరకు ఆన్​లైన్​ స్పెల్ఫ్​ రిపోర్టింగ్  
సెకండ్ ఫేజ్‌:
మే 15 నుంచి 25 వరకు దరఖాస్తులు 
మే 15 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లు 
మే 30న రెండో ఫేజ్‌ సీట్ల కేటాయింపు 
జూన్ 5 వరకు ఆన్​లైన్​ స్పెల్ఫ్​ రిపోర్టింగ్  
థర్డ్ ఫేజ్‌ :
మే 31 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు 
మే 31 నుంచి జూన్16 వరకు వెబ్ ఆప్షన్లు 
జూన్ 20న థర్డ్ ఫేజ్‌ సీట్ల కేటాయింపు 
జూన్ 25 వరకు ఆన్​లైన్​ స్పెల్ఫ్​ రిపోర్టింగ్