సీపీఎస్ రద్దుపై సప్పుడు లేదు.. ఆందోళనలో ఉద్యోగులు, టీచర్లు

సీపీఎస్ రద్దుపై సప్పుడు లేదు.. ఆందోళనలో ఉద్యోగులు, టీచర్లు
  • 2004 కంటే ముందు నోటిఫికేషన్లతో 9వేల మంది భర్తీ
  • పాత పింఛను విధానం అమలుకు నెలన్నరే గడువు
  • ఇప్పటికీ ఆ అంశాన్ని పట్టించుకోని రాష్ట్ర సర్కార్
  • ఆందోళనలో ఉద్యోగులు, టీచర్లు

హైదరాబాద్, వెలుగు: పాత పింఛన్ విధానం (ఓపీఎస్) అమలు చేసేందుకు ఉన్న అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదు. ఆగస్టు 31లోగా ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటే, 9 వేల మంది ఉద్యోగులు, టీచర్లు సీపీఎస్ గండం నుంచి బయటపడే చాన్స్ ఉంది. అయినా, ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో 2004 కంటే ముందు నోటిఫికేషన్లు ఇచ్చి, ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దేశంలో 2004లో పాత పింఛను స్థానంలో కంట్రిబ్యూటరీ పింఛను స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా జనవరి 1, 2004 నుంచి అమల్లోకి తెచ్చారు. నాటి ఉమ్మడి ఏపీలో 2004, సెప్టెంబర్1 నుంచి అమలు చేశారు. అయితే, 2004 జనవరి 1 కంటే ముందే డీఎస్సీ, పోలీస్ పోస్టుల రిక్రూట్​మెంట్ తోపాటు పలు నోటిఫికేషన్లు రిలీజ్ చేసినా, రిక్రూట్​మెంట్ ప్రక్రియ ఆలస్యం కావడంతో సుమారు 9వేల మందికి పాత పింఛను అమలు కాలేదు. దీంతో 6వేల మంది టీచర్లు, 2వేల మంది పోలీసులు, గ్రూప్2 అధికారులు, జ్యుడీషియల్, ఇరిగేషన్ తదితర విభాగాల్లో సుమారు వెయ్యి మంది సీపీఎస్ విధానంలోకి మారిపోయారు. దీనిపై వారంతా అనేక ఆందోళనలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.

డీఎస్సీ 2003 టీచర్లకు అన్యాయం

ఉమ్మడి ఏపీలో 16,447 పోస్టుల భర్తీకి 2003 నవంబర్13న డీఎస్సీ నోటిఫికేషన్​ను రిలీజైంది. 2004 ఏప్రిల్ 4,5,6 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించి, అదే ఏడాది జూన్ 11న ఫలితాలు రిలీజ్ చేశారు. అయితే, సెలెక్షన్ లిస్టును మాత్రం 2005 ఫిబ్రవరి 10న ప్రకటించారు. రిజల్ట్ వచ్చాక.. సెలెక్షన్ లిస్టు ప్రకటించేందుకు ఏడునెలల టైమ్ తీసుకున్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను రెండేండ్ల పాటు సాగదీశారు. వారిని సీపీఎస్ పరిధిలోకి తీసుకొని కొనసాగిస్తున్నారు. కనీసం, రిజల్ట్ టైమ్ పరిగణనలోకి తీసుకున్నా.. వారంతా ఓపీఎస్ లోకి వచ్చేవారు. సర్కారు నిర్లక్ష్యం.. వారికి శాపంగా మారింది. అయితే, డీఎస్సీ 2003 నోటిఫికేషన్​లో మాత్రం సీపీఎస్ అమలు విషయాన్ని ఎక్కడా పొందపర్చలేదు. కానీ, ఆ తర్వాత నోటిఫికేషన్​లలో మాత్రం సీపీఎస్ అమలు చేయనున్నట్టు పేర్కొనడం గమనార్హం.

ALSO READ:బెంగళూరులో ప్రతిపక్ష నేతలు..నేడు కూటమిపై చర్చ

కేంద్రం చాన్స్ ఇచ్చినా.. స్పందించట్లే

సీపీఎస్ విధానంపై అనేక రాష్ట్రాల్లో ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో కొంతమందికి మినహాయింపు ఇచ్చేలా 2020లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్లు ఇచ్చి, ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికీ ఓపీఎస్ విధానంలోకి మార్చుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ ప్రక్రియ పూర్తిచేశాయి. కానీ, తెలంగాణ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి విధానం తీసుకోలేదు. ముందుగా మార్చి నెలాఖరు వరకే గడువు ఉండగా, దాన్ని ఆగస్టు 31 వరకూ పెంచింది. అప్పటిలోపు రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 ముందు నోటిఫికేషన్ల ఇచ్చి.. వాటి ద్వారా ఉద్యోగాలు చేస్తున్న సుమారు 9వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను సీపీఎస్​ నుంచి ఓపీఎస్​ కు మార్చుతామనీ కేంద్రానికి చెప్పాల్సి ఉంది. ఒకవేళ వారిని ఓపీఎస్ లో చేర్చితే, ఆయా కుటుంబాలకు పింఛను పొందే అవకాశముంది. దీనిపై ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వారందరినీ ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని మంత్రులు, ఉన్నతాధికారులను కలిసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. నిర్ణయం తీసుకునేందుకు కేవలం నెలన్నర గడువే ఉండటంతో, వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారనీ సీపీఎస్ టీచర్, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ చెప్పారు. తక్షణమే డీఎస్సీ 2003 టీచర్లకు పాత పింఛను అమలు చేయాలని కోరారు.

ఓపీఎస్​లోకి మార్చాలె

కేంద్రం ఇచ్చిన మెమో ఆధారంగా పలు రాష్ట్రాలు సీపీఎస్ నుంచి పాత పింఛను విధానంలోకి మార్చారు. మన రాష్ట్రంలోనూ అమలు చేయాలనీ కోరుతున్నం. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ఆర్థికభారం పడదు. కేంద్ర నుంచి వెంటనే రూ.2వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి జమ అవుతాయి. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వకపోతే, ఆందోళనకు సిద్ధమవుతాం. త్వరలోనే ఇందిరా పార్కు వద్ద రిలే దీక్షలతో మా పోరాటం ప్రారంభిస్తాం.

- మాడవేడి వినోద్ కుమార్, 
2003 డీఎస్సీ పాత పింఛను 
పోరాట సమితి ప్రెసిడెంట్