ఐడీపీఎల్‌‌ భూములపై విజిలెన్స్ ఎంక్వైరీ..ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్‌‌ టీమ్

ఐడీపీఎల్‌‌ భూములపై విజిలెన్స్ ఎంక్వైరీ..ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్‌‌ టీమ్
  • సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్‌‌ టీమ్ ఏర్పాటు, రెవెన్యూ రికార్డులు సేకరిస్తున్న విజిలెన్స్
  • కూకట్‌‌పల్లిలోని 376 సర్వే నంబర్‌‌‌‌లో భూములు అన్యాక్రాంతం
  • రూ. వేల కోట్ల భూముల కబ్జాపై ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత 
  • పరస్పర ఆరోపణలు.. వీటి ఆధారంగానే కొనసాగుతున్న విచారణ!

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్‌‌లోని ఐడీపీఎల్‌‌ భూముల అన్యాక్రాంతం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాల్సిందిగా విజిలెన్స్‌‌ అండ్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టర్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.  కూకట్‌‌పల్లి  పరిధిలోని సర్వే నంబర్‌‌ 376లో ఉన్న రూ. వేల కోట్లు విలువ చేసే   భూములు అక్రమంగా  ఎవరి చేతుల్లోకి వెళ్లాయి? ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే అంశాలపై నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్ యంత్రాంగాన్ని రంగంలోకి దించింది.

ప్రత్యేకంగా ఒక ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి.. దర్యాప్తును ముమ్మరం చేసింది.  కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్సీ కవిత బయటపెట్టిన  పత్రాలు, చేసిన తీవ్ర ఆరోపణలే ఈ విచారణకు కీలక ప్రాతిపదికగా మారినట్లు తెలిసింది. అధికార యంత్రాంగం సహకారంతో జరిగిన భూ వినియోగ మార్పిడి వ్యవహారంపైనా విజిలెన్స్ నజర్ పెట్టింది. కవిత లేవనెత్తిన అంశాల ప్రకారం.. ఐదెకరాల ఇండస్ట్రియల్‌ (పారిశ్రామిక) ల్యాండ్‌ను 2022లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెసిడెన్షియల్‌ (నివాస) భూమిగా మార్చింది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిని, నిబంధనలను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నివాస ప్రాంతంగా ఎలా మార్చారన్నది ఇప్పుడు తేల్చనున్నారు. ఈ మార్పిడి వెనుక భారీ ఎత్తున చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సహకరించిన అప్పటి రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్రపై విజిలెన్స్ టీమ్ కూపీ లాగుతున్నది. ఈ వ్యవహారం అంతా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కనుసన్నల్లోనే జరిగిందన్న కవిత వాదనలోని నిజానిజాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఫైళ్లను జల్లెడ పడుతున్న విజిలెన్స్‌ బృందం

ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. సర్వే నంబర్‌ 376లో మొత్తం ఎంత భూమి ఉంది? అందులో ఎంత అన్యాక్రాంతమైంది? ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని ధర ఎంత? ఆక్రమణదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లోకి ఎలా ఎక్కాయి? అనే వివరాలను సేకరిస్తున్నది. ముఖ్యంగా కవిత ప్రధానంగా ప్రస్తావించిన మాధవరం కుమారుడి చెరువు కబ్జా, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి భాగస్వామ్యం ఉన్న నవనామీ వెంచర్స్ అనుమతుల ఫైళ్లను అధికారులు జల్లెడ పడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలు ఉల్లంఘించిన అధికారుల జాబితాను కూడా విజిలెన్స్ సిద్ధం చేస్తున్నది. త్వరలోనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించే దిశగా అడుగులు పడుతుండటంతో, ఈ భూముల వ్యవహారంలో ఇంకెన్ని  బయటపడతాయోనన్న ఉత్కంఠ నెలకొన్నది. 

మాధవరం మీడియా సమావేశంతో మొదలు..

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశంతో ఈ వివాదం మొదలైంది. రూ. వేల కోట్లు విలువ చేసే ఐడీపీఎల్‌ భూములను ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ ‘ఓవర్ ల్యాప్’ పేరుతో కబ్జా చేశారని, ఇది భారీ స్కామ్ అని ఆయన కొన్ని పత్రాలను ప్రదర్శించారు. అనిల్ ఆక్రమణల వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయితే, మాధవరం ఆరోపణల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని కవిత ఎదురుదాడి చేయడంతో పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యుల అక్రమాలను, తన పార్టీలోని మిత్రుల రియల్ ఎస్టేట్ దందాలను దాచిపెట్టి.. తనపై నిందలు వేస్తున్నారని ఆమె ఆధారాలు బయటపెట్టడంతో  ఈ వ్యవహారంపై ఇప్పుడు ప్రభుత్వ విచారణకు దారితీసింది. 

కవిత ఆరోపణలతో  బయటపడ్డ భూకబ్జా

ఐడీపీఎల్ భూములను కవిత భర్త అనిల్ ఆక్రమించుకున్నారంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  ఆరోపించిన తర్వాత ఆమె తీవ్రంగా స్పందించారు.  ఆ  ఆరోపణలకు ధీటుగా బదులిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ అక్రమాల చిట్టా ఇదిగో అంటూ కవిత బయటపెట్టారు. నీతులు వల్లిస్తున్న మాధవరం కృష్ణారావు సొంత కుమారుడే నిబంధనలకు విరుద్ధంగా చెరువు భూములను కబ్జా చేశారని ఆరోపించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం  సీరియస్‌గా తీసుకున్నది. మాధవరం కృష్ణారావు ఆరోపిస్తున్న భూమిలో తన భర్త అనిల్ 2019లోనే పెట్టుబడుల నుంచి తప్పుకున్నారని కవిత స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాతే అసలు నాటకం మొదలైందని, ఆ భూమి ‘నవనామీ వెంచర్స్’ చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఈ వెంచర్‌లో ఏవీ రెడ్డితోపాటు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన, మాజీ మంత్రి కేటీఆర్‌కు కుడిభుజంలాంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి భాగస్వామ్యం ఉందని బయటపెట్టారు. తన పార్టీకి చెందిన అగ్ర నేతలు, తనకు సన్నిహితులైన వ్యక్తులు ఇందులో ఉన్నారన్న విషయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తెలిసినా, వారిని రక్షించేందుకే తన భర్తపై బురద జల్లుతున్నారని కవిత పేర్కొన్న విషయం తెలిసిందే.