వరిసాగులో పంజాబ్‌‌‌‌‌‌‌‌ను దాటేసినం..పంటల సాగులో సరికొత్త రికార్డులు

వరిసాగులో పంజాబ్‌‌‌‌‌‌‌‌ను దాటేసినం..పంటల సాగులో సరికొత్త రికార్డులు
  • రెండేండ్లుగా స్థిరంగా వ్యవసాయ రంగం వృద్ధి 
  • పండించిన ప్రతిగింజ కొనుగోలు
  • సన్నధాన్యానికి రూ.500 బోనస్​
  • రైతు సంక్షేమానికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అగ్రికల్చర్​ రంగం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సుస్థిర పాలన, లాభదాయక రైతు విధానాలు, క్షేత్రస్థాయి విస్తరణ ఫలితాలతో  వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి సాధిస్తోంది. గత రెండేళ్లలోనే  దేశం దృష్టిని ఆకర్షించేలా పంటల సాగు, దిగుబడి రికార్డులు నమోదయ్యాయి.

 ప్రతిష్టాత్మకంగా భావించే పంజాబ్‌‌‌‌‌‌‌‌ను వరిసాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో దాటేసి.. దేశంలోనే తెలంగాణ నంబర్‌‌‌‌‌‌‌‌ వన్  స్థానాన్ని సొంతం చేసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలోనే తెలంగాణ రైతాంగం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ‘రైతే రాజు’ అనే నినాదం మాటల్లో కాకుండా.. చేతల్లో చూపిస్తోంది. 

ప్రస్తుత ధరల్లో 2023–-24లో రూ.1,00,004 కోట్లుగా ఉన్న వ్యవసాయ రంగ స్థూల ఉత్పత్తి విలువ (జీఎస్ వీఏ) వాటా.. 2024–-25లో రూ.1,06,708 కోట్లకు చేరింది. రైతులకు ఆర్థిక భద్రత, ప్రోత్సాహకాలతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో రెండేళ్లలోనే 6.7 శాతం స్థూల ఉత్పత్తిలో పెరుగుదల నమోదైంది.   

2023–24లో రెండు సీజన్లు కలిపి 209.62 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. దిగుబడి 296.17 లక్షల టన్నులుగా నమోదైంది. 2024–25లో రెండు సీజన్​లు కలిపి 220.77 లక్షల ఎకరాలు సాగు జరగగా మొత్తం -320.62 లక్షల టన్నుల దిగుబడి నమోదైంది. 

వరిసాగులో  తెలంగాణ టాప్! 

2023–-24లో  రెండు సీజన్లలో  118.11 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగి మొత్తం 260.88 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి సాధించింది. 2024-–25లో వానాకాలం, యాసంగి కలిపి 127.03 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగగా  284.16 లక్షల టన్నుల వరిధాన్యం దిగుబడి సాధించి టాప్​లో నిలిచింది. 

ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచింది. దేశంలోనే వరిసాగు విస్తీర్ణంలో తెలంగాణ నంబర్ వన్  స్థానాన్ని నిలబెట్టుకుంది. గత వానాకాలం సీజన్​లో 66.77 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా గతంలో ఎన్నడూలేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. దేశంలోనే అతి ఎక్కువ వరిసాగు విస్తీర్ణం, దిగుబడి సాధించి రికార్డులు సృష్టించింది. 

పత్తిలోనూ భారీ ఎగుమతి  

రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం స్థిరంగా ఉన్నా.. కాటన్​ ఉత్పత్తి 26.35 లక్షల టన్నుల నుంచి 30.24 లక్షల టన్నులకు పెరిగింది. రూ.లక్ష కోట్లు దాటిన రైతు సంక్షేమం ఖర్చు  కొత్త సర్కారు వచ్చిన తొలి రెండేండ్లలోనే రూ.54,280 కోట్లతో వివిధ రైతు పథకాలు అమలు చేసింది. 

మొత్తం రైతు సంక్షేమంపై రూ.లక్ష కోట్లకుపైగా వెచ్చించి ప్రజాప్రభుత్వం తనదైన ఘనత సాధించింది. ప్రధానంగా- రూ.20,616 కోట్లతో 25.36 లక్షల రైతు కుటుంబాలకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. -ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమల్లోకి తెచ్చిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని నిరాటంకంగా ప్రజా ప్రభుత్వం కొనసాగించింది. 

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు ఏటా దాదాపు రూ.10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించింది. -రైతు భరోసాను ఎకరాకు రూ.12 వేలు ప్రకటించి 9 రోజుల్లోనే రూ.8,744 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. - రైతు బీమాపై ఎల్​ఐసీని ఒప్పించి ప్రీమియంను రూ.3,400 నుంచి  రూ.3,225కు తగ్గించింది.

పండించిన ప్రతిగింజ కొనుగోలు

రైతులు సన్నధాన్యం పండించేందుకు ప్రోత్సహిస్తూ - సన్నవడ్లకు రూ.500 బోనస్ ప్రకటించింది. ఈ సీజన్ లోనే ఇప్పటి వరకు రూ.314 కోట్లు రైతులకు బోనస్​గా చెల్లించింది. రాష్ట్రవ్యాప్తంగా  8,380 - ధాన్యం కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటు చేసి 38.72 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు  రూ.10,162 కోట్లు చెల్లించింది.  

రైతులు ధాన్యం అమ్ముకున్న రెండే రోజుల్లోనే చెల్లింపులు చేస్తోంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి  రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేయగా దానిని రద్దుచేసి  భూభారతి చట్టంతో రైతులకు పూర్తి హక్కులు కల్పించింది. - 

ప్రకృతి విపత్తుల నష్టపరిహారం రూ.139.58 కోట్లు చెల్లింపు

ప్రకృతి విపత్తుల నష్టపరిహారం రూ.139.58 కోట్లు చెల్లించి రైతులను కాంగ్రెస్  ప్రభుత్వం ఆదుకున్నది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెనుకాడలేదు. గత ఏడాది మార్చి, సెప్టెంబరులో వడగండ్ల వర్షాలతో నష్టపోయిన 94,462 మంది రైతులకు రూ.95.39 కోట్ల పరిహారం అందించింది. ఇటీవల మార్చి, ఏప్రిల్ లో  వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన 36,449 మంది రైతులకు రూ.44.19 కోట్ల పరిహారం అందించింది.