ఐదేండ్లలో 920 కోట్లు ఖర్చు చేస్తే.. 4 రెట్లు లాభం రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు అపార అవకాశాలు

ఐదేండ్లలో 920 కోట్లు  ఖర్చు చేస్తే..  4 రెట్లు లాభం రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు అపార అవకాశాలు
  • 3.77 లక్షల ఎకరాలకు పండ్లు, కూరగాయల సాగు పెంపు లక్ష్యం 
  • ‘పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టివ్​ప్లాన్ ఇన్ తెలంగాణ–2035’ని రూపొందించిన హార్టికల్చర్ వర్సిటీ
  • నివేదికను విడుదల చేసిన సీఎం

హైదరాబాద్, వెలుగు: ఉద్యాన పంటల సాగులో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని హార్టికల్చర్​ యూనివర్సిటీ ప్రభుత్వానికి సూచించింది. వచ్చే ఐదేండ్లలో కూరగాయలు, పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు రూ.920.90 కోట్లు ఖర్చు చేస్తే, దానికి నాలుగు రెట్ల లాభం సాధించవచ్చని తెలిపింది. ఈ మేరకు పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టివ్​ప్లాన్ ఇన్ తెలంగాణ –2035 రిపోర్టును రూపొందించింది. దీన్ని సీఎం రేవంత్​రెడ్డి గురువారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్​ చేశారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎస్​ రామకృష్ణారావు, వర్సిటీ వీసీ డాక్టర్ డి.రాజిరెడ్డి పాల్గొన్నారు.

ఉద్యాన పంటల సాగులో ఎదురువుతున్న సమస్యలను అధిగమించేందుకు వర్సిటీ సమగ్ర ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రంలో హార్టికల్చర్ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. వాతావరణం అనుకూలించడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలను సద్వినియోగం చేసుకుంటే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సులభమేనని తెలిపింది. 

పంటల లోటును భర్తీ చేయడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి.. రాబోయే ఐదేండ్లలో పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని 3.77 లక్షల ఎకరాల మేర పెంచాలని సూచించింది. ఇప్పటికే సాగవుతున్న పండ్ల తోటల్లో హార్టికల్చర్​వర్సిటీ సాంకేతికతలను ఉపయోగిస్తే, సంవత్సరానికి అదనంగా రూ.1,341 కోట్లు లాభం వస్తుందని తెలిపింది. రాష్ట్రంలో వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున, నాణ్యమైన హార్టికల్చర్ ఉత్పత్తుల సాగుకు చాలా అనుకూలమని చెప్పింది.

 రాష్ట్రంలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 6 శాతం భూమి మాత్రమే ఉద్యాన పంటల కింద ఉన్నప్పటికీ, 2022–-23లో ఇది రాష్ట్ర వ్యవసాయ స్థూల విలువ ఉత్పత్తికి ఏకంగా 30 శాతం వాటాను అందించిందని పేర్కొంది. అందుకే ఈ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధికి  గ్రోత్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌గా గుర్తించింది. అయితే అధిక ఖర్చు, నాణ్యమైన నారు టైమ్​కు దొరకకపోవడం, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం, దళారుల జోక్యం, తక్కువ ఆదాయం వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయని.. వీటిని అధిగమించాలని సూచించింది.

సాగు విస్తీర్ణం పెంచాలి.. 

రాష్ట్రంలో కొన్ని పంటల దిగుబడి తక్కువగా ఉందని నివేదికలో వర్సిటీ పేర్కొంది. పసుపు, అల్లం, చామంతి పంటల ఉత్పాదకతలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. జామ, ఉల్లి, టమాటా పంటల్లో దిగుబడి పెరగాల్సిన అవసరం ఉందని తెలిపింది.

కొత్తగా పండ్ల తోటలను 1.32 లక్షల ఎకరాల్లో విస్తరించాలని సూచించింది. జామ, బొప్పాయి, అరటి, సపోటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష వంటి 12 రకాల పండ్ల సాగు విస్తీర్ణాన్ని గుర్తించిన ప్రాంతాల్లో పెంచాలని చెప్పింది. టమాటా, వంకాయ, ఉల్లి, పచ్చిమిర్చి వంటి 16 రకాల కూరగాయల సాగును 2.45 లక్షల ఎకరాలకు పెంచాలని సూచించింది. ఉత్పత్తుల రవాణాకు రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ అందుబాటులో ఉందని.. అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌‌‌‌‌‌‌‌తో పాటు వ్యవసాయం, దాని అనుబంధ పరిశోధన సంస్థలకు తెలంగాణ ముఖ్య కేంద్రంగా ఉండటం  సానుకూల అంశమని చెప్పింది. 

నివేదికలో పేర్కొన్న అంశాలివీ.. 

కూరగాయల సాగు విస్తీర్ణం 2018-–19 తర్వాత తగ్గుముఖం పట్టింది. గత దశాబ్దంలో వృద్ధిరేటు 8.4% నమోదైంది. కూరగాయల సాగును 2.45 లక్షల ఎకరాలు పెంచాలి.  

పండ్ల తోటల సాగు విస్తీర్ణంలో మామిడి, బత్తాయి కలిపే 87% ఉన్నాయి. వీటి సాగును తగ్గించాలి. 2035 నాటికి రాష్ట్రంలో పండ్ల డిమాండ్‌‌‌‌‌‌‌‌ 23.74 లక్షల టన్నులుగా అంచనా. ప్రస్తుత ఉత్పత్తిని బట్టి చూస్తే, అప్పటి వరకు 5.09 లక్షల టన్నుల కొరత ఏర్పడుతుంది. దీన్ని అధిగమించేందుకు పండ్ల సాగును 1.32 లక్షల ఎకరాలకు పెంచాలి.  
చిన్న, సన్నకారు రైతులకు సహాయం చేయడానికి ప్రతి మండలంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.
కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, పండ్లను పక్వానికి తెచ్చే చాంబర్లు, రిఫ్రిజిరేటెడ్ రవాణా వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. 
ధరల అంచనా కోసం వర్సిటీలో మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు చేయాలి.
ఎగుమతులు పెంచడానికి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు దగ్గర ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు.