- నచ్చిన చోట ఎగ్జామ్ సెంటర్ కావాలంటే ముందుగా అప్లై చేసుకోవాల్సిందే
- ఇప్పటికే 1.26 లక్షలు దాటిన టెట్ అప్లికేషన్లు
- 16 జిల్లాల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాటు
- ఈ నెల 29 వరకు దరఖాస్తులకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్)కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే, నచ్చిన చోట సెంటర్ కావాలంటే ముందే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. టీజీ టెట్ సెంటర్ల కేటాయింపులో విద్యా శాఖ ఈసారి కూడా ‘ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్’(ముందు వచ్చిన వారికి ముందు) నిబంధనను అమలు చేస్తోంది. పరీక్ష రాసేందుకు సొంత జిల్లా లేదా ఇంటికి దగ్గర్లో ఉన్న సెంటర్ కోరుకునే అభ్యర్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వచ్చే ఏడాది జనవరిలో జరిగే టెట్ కోసం ఈ నెల 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం వరకు 1,26,085 మంది అప్లై చేసుకున్నారు. దీంట్లో 46,954 మంది పేపర్ 1 కోసం, 79,191 మంది పేపర్ 2 కోసం దరఖాస్తు చేశారు. ఈ నెల 29 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 1 వరకు దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరణకు చాన్స్ ఇచ్చారు. అయితే, దరఖాస్తునకు మరో ఐదు రోజులే ఉండటంతో అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
16 సెంటర్ల ఆప్షన్లు ఇవే..
అభ్యర్థుల సౌకర్యార్థం ఈసారి 16 జిల్లాల్లో ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా నల్గొండ, కోదాడ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, సిద్దిపేట, సత్తుపల్లి, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, నర్సంపేట, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో సెంటర్లను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.
కోటా నిండితే.. పక్క జిల్లాకే..
ప్రతి ఎగ్జామ్ సెంటర్‌కు ఒక నిర్ణీత సామర్థ్యం ఉంటుంది. ఆ కోటా పూర్తయిన వెంటనే ఆన్ లైన్ లిస్టు నుంచి ఆ సెంటర్ పేరు మాయమ వుతుంది. ఉదాహరణకు హైదరాబాద్ లేదా వరంగల్ కెపాసిటీ నిండిపోతే, ఆ జిల్లాల అభ్యర్థులు దూరంగా ఉన్న వేరే సెంటర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. మరోపక్క ఆప్షన్ల ప్రకారం ఎక్కువ మంది ఒకే జిల్లాను ఎంచు కుంటే ముందుగా ఆప్షన్ ఇచ్చిన వారికే ఆ సెంటర్‌ను అలాట్ చేయనున్నారు. మరోపక్క చివరి రోజుల్లో అప్లై చేద్దామను కుంటే టెక్నికల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దీంతో అభ్యర్థులంతా ముందుగానే అప్లై చేసుకోవాలని టెట్ కన్వీనర్ జి.రమేష్ సూచించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహా లుంటే 709370 8883/ 7093708884 / 7093958881/ 709346 8882 హెల్ప్‌లైన్ నంబర్లకు వర్కింగ్ అవర్స్‌లో కాల్ చేయాలని సూచించారు.
