అమరుల కుటుంబాలకు సాయమేది..

అమరుల కుటుంబాలకు సాయమేది..
  • 1,500 మంది అమరులయ్యారని అప్పట్లో కేసీఆర్​ ప్రకటన
  • ఆదుకున్నది మాత్రం 638​ కుటుంబాలనే
  • త్యాగధనుల లెక్కలు కూడా సర్కారు దగ్గర లేవ్​
  • చేతికొచ్చిన బిడ్డలను కోల్పోయి తల్లిదండ్రులు.. పెద్దదిక్కును కోల్పోయి కుటుంబాల అరిగోస
  • ఆ కుటుంబాల దిక్కు కన్నెత్తి చూడని పాలకులు
  • ఇయ్యాల అమరుల స్మారక జ్యోతిని ప్రారంభించనున్న సీఎం
  • కొందరికి మాత్రమే ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు:  అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆ అమరుల కుటుంబాలను పట్టించుకునే దిక్కు లేకుండాపోయింది. మన రాష్ట్రం మనకు వస్తే మన బతుకులు మారుతాయని, తమ చావుతోనైనా తెలంగాణ రావాలని ఎందరో యువతీయువకులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, జర్నలిస్టులు ప్రాణత్యాగం చేశారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు గడిచిపోయి.. దశాబ్ది సంబురాలను సర్కారు జరుపుకుంటున్నా.. వందలాది అమరుల కుటుంబాలకు పైసా సాయం అందలేదు. ఉద్యమమప్పుడు ఆ అమరుల పాడెలను మోసిన నాయకులు.. ఇప్పుడు పాలకులుగా ఏలుతున్నా.. ఆ కుటుంబాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. 


చేతికి అందివచ్చిన బిడ్డలను కోల్పోయి తల్లిదండ్రులు.. ఇంటిపెద్దలను కోల్పోయి కుటుంబాలు.. అల్లాడుతున్నాయి. అమరవీరుల సంఖ్య 1,500 వరకు ఉంటుందని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్​అసెంబ్లీ వేదికగా అప్పట్లో ప్రకటించారు. వాళ్లందరి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు 638 మంది కుటుంబాలకు మాత్రమే సాయం అందించారు. మిగతా వారిని లెక్కలోకి కూడా తీసుకోలేదు. 

ఎందరో అమరులు

1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి అప్పటి సమైక్య పాలకులు 369 మంది ఉద్యమకారుల ప్రాణాలను బలితీసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు తెలంగాణ పేరుతో ఉద్యమబాట పట్టినా ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపేవారు.  అయినా ఉద్యమ ఆకాంక్షను మాత్రం అణచివేయలేకపోయారు. మలిదశ ఉద్యమంలో యువత ఎక్కువగా పాల్గొన్నది. ముఖ్యంగా ఓయూ, కేయూ గడ్డ మీద స్టూడెంట్లు పోరాడారు. 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించి వెనక్కి తగ్గడంతో బలిదానాలు ఎక్కువయ్యాయి. ఉద్యమం నీరుగారొద్దని, తమ ప్రాణత్యాగాలతోనైనా తెలంగాణ రావాలని ఎల్బీనగర్​ చౌరస్తాలో శ్రీకాంతాచారి, ఓయూ ఎన్​సీసీ గేటు ముందు సిరిపురం యాదయ్య తమ ఒంటికి నిప్పంటించుకొని అందరి ముందే ప్రాణాలర్పించారు. కానిస్టేబుల్​కిష్టయ్య.. తుపాకీతో కాల్చుకొని తుదిశ్వాసవిడిచారు. ఢిల్లీలో పార్లమెంట్​ సాక్షిగా చెట్టుకు ఉరివేసుకొని యాదిరెడ్డి ప్రాణాలర్పించాడు. నాగరాజు, సువర్ణ, పావని, వేణుగోపాల్​రెడ్డి.. ఇట్లా ఎందరో తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగాలకు కలత చెంది యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

అమరుల లెక్కలు కూడా లేవు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో ప్రాణ త్యాగం చేస్తే.. వారి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు. సాక్షాత్తు ఉద్యమ టైమ్​లో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా కేసీఆర్​ 1,500 మంది తెలంగాణ కోసం చనిపోయారని చెప్పినప్పటికీ.. అమరవీరులను లెక్కించడంలో పోలీస్​స్టేషన్లలోని ఎఫ్​ఐఆర్​లను ప్రాతిపదిక చేసుకున్నారు. కేవలం 638 మందిని మాత్రమే అమరులుగా గుర్తించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినట్లు బయటకు రావొద్దని అప్పట్లో సమైక్య పాలకులు ఎఫ్​ఐఆర్​లో చాలా మంది పేర్లు నమోదు కాకుండా అడ్డుకున్నారు. 

కానీ, ఆ ఎఫ్​ఐఆర్​లనే ఇప్పటి ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకోవడంపై ఉద్యమకారులు మండిపడుతున్నారు. అమరుల కుటుంబాలకు స్వరాష్ట్రంలో ఇచ్చే గుర్తింపు ఇదా అని నిలదీస్తున్నారు. సర్కారు ఇస్తామన్న సాయం కోసం అమరుల కుటుంబసభ్యులు ప్రభుత్వ పెద్దల చుట్టూ, సర్కార్​ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫాయిదా ఉంటలేదు. శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్న దాదాపు తొమ్మిదేండ్లకు ఎల్బీ నగర్​చౌరస్తాకు ఆయన పేరు పెట్టాలన్న ఆలోచన పాలకులకు వచ్చింది. సెక్రటేరియెట్​ ముందు కట్టిన అమరవీరుల స్మారక స్థూపంలో తమ బిడ్డలు, తోబుట్టువుల ఫొటోలు ఏర్పాటు చేయాలని సర్కారీ సాయం అందని అమరుల కుటుంబసభ్యులు మంత్రులను కలిసి కోరినా లాభం లేకుండాపోయింది.

అంత్యక్రియల సాక్షిగా హామీ ఇచ్చి..!

నిజామాబాద్​ జిల్లా సిరికొండకు చెందిన అల్లపురం శ్రీనివాస్​  తెలంగాణ కోసం మంటల్లో ఆహుతయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతుందన్న బాధతో 2010 జులై 24న ఒంటిపై కిరోసిన్​ పోసుకొని నిప్పంటించుకున్న శ్రీనివాస్​.. 90 శాతం గాయాలతో  హైదరాబాద్​లోని హాస్పిటల్​లో  చికిత్స పొందుతూ అదే నెల 26న ప్రాణాలు వదిలాడు.  మర్నాడు సిరికొండలో జరిగిన అంత్యక్రియలకు స్వయంగా కేసీఆర్ ​హాజరై.. శ్రీనివాస్​ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇద్దరు పిల్లలు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అత్త, చెవులు వినపడని ఒక ఆడపడుచు, విడాకులు తీసుకున్న మరో ఆడపడుచు.. ఇట్ల వీరందరి భారాన్ని శ్రీనివాస్​ భార్య  సునీత ఇటు కులవృత్తి అయిన చాకలి పని చేస్తూ, అటూ బీడీలు చుడుతూ మోస్తున్నది. 

రెక్కాడితే కానీ డొక్కాడదు 

తెలంగాణ ఉద్యమంలో ఏ ప్రోగ్రామ్​ జరిగినా నాతోపాటు నా కొడుకు వీర్రాజును వెంట తీసుకొని పోతుంటిని. తెలంగాణ వస్తలేదన్న బెంగతో వీర్రాజు రైలు కింద పడి ప్రాణాలర్పించిండు. రాష్ట్రం వచ్చింది కానీ నా కొడుకు త్యాగానికి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. మహారాష్ట్ర, పంజాబ్​, ఢిల్లీకి వెళ్లి అక్కడివాళ్లకు ప్రభుత్వం పైసలు ఇస్తున్నది కానీ.. ఇక్కడి అమరుల కుటుంబాలను మాత్రం ఆదుకుంటలేదు. రాష్ట్రం కోసం కొడుకును కోల్పోయిన మమ్మల్ని పట్టించుకునే వారే లేరు.  రెక్కాడితే కానీ డొక్కాడదు మాకు.

- కట్ట భాస్కర్​, అమరుడు వీర్రాజు తండ్రి, పెద్ద పాపయ్యపల్లె, కరీంనగర్​ జిల్లా

గుడిసెలో వీరుడి కుటుంబం

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావు సాయి పేట గ్రామానికి చెందిన భూస మల్లేశం అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఎంత పోరాడిన తెలంగాణ రావడం లేదని మనోవేదనకు గురయ్యేవాడు. ఉద్యమంలో భాగంగా గ్రామంలో చేపట్టిన ర్యాలీలో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు. మల్లేశం అంత్యక్రియలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాయకులు, కవులు, కళాకారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్.. మల్లేశం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ తెలంగాణ వచ్చినంక మల్లేశం కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. తెలంగాణ అమర వీరుల పథకం కింద ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు. గ్రామస్తులు తలా కొంత చందా వేసుకొని గుడిసె నిర్మించి ఇవ్వడంతో అదే గుడిసెలో మల్లేశం కుటుంబం నివసిస్తున్నది.

పోరాటంలోనే ఆగిన గుండె

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన వడ్లకొండ లక్ష్మారెడ్డి.. జర్నలిస్టు. తెలంగాణ ఉద్యమంలో దుబ్బాక నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ గా పని చేశాడు. ఆయనపై నాలుగు పోలీసు కేసులు నమోదైనా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఉద్యమంలోనే ఆయన గుండెపోటుతో మృతి చెందాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇప్పటికీ ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోవడంతో భార్య వనజ  ప్రైవేట్ కాలేజీలో  పనిచేస్తుండగా, కూతురు మంజీరా ఆరవ తరగతి చదువుతున్నది. 

పాడె మోసినోళ్లు.. ఇప్పుడు!

తెలంగాణ కోసం ఎందరో ఆత్మబలిదానాలు చేసుకోగా.. వారి అంత్యక్రియల్లో జనంతోపాటు నాయకులు కూడా పాల్గొన్నారు. ఇప్పటి సీఎం కేసీఆర్ కూడా అప్పట్లో పలువురి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. తెలంగాణ వస్తే ఆయా కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని చేర్చారు. అధికారంలోకి వచ్చాక.. జీవోలు 36, 80 తీసుకువచ్చి కేవలం 638 కుటుంబాలకు సాయం చేశారు. తెలంగాణ అమరవీరుల పథకం పేరిట ఆ కొన్ని కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అమరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, సాగుభూమి, డబుల్​ బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. కొందరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. తెలంగాణ కోసం 1,500 మంది ప్రాణాలర్పించారని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్​.. ఆదుకున్నది మాత్రం 638 మంది కుటుంబాలకే.

ఒక్క రూపాయి రాలే..

మాది నిర్మల్ జిల్లా భైంసా పట్టణం. నాకు ఇద్దరు కొడుకులు. తెలంగాణ వస్తే బతు కులు మారుతాయని పెద్దకొడుకు యోగేశ్​  మాతో చెప్తుండె. తెలంగాణ రాదేమోనని 2012 జనవరి 12న పురుగుల మందు తాగి ప్రాణ త్యాగం చేసిండు. అమరుల కుటుంబాలకు 10 లక్షల సాయం అందిస్తామని కేసీఆర్​ చెప్పినా.. ఇప్పటికీ  మాకు ఒక్క రూపాయి రాలేదు. నోట్లె ముద్ద పెట్టుకున్నప్పుడల్లా కొడుకే యాదికొస్తడు.    

- సల్లందుల శోభ, అమరుడు యోగేశ్​ తల్లి, భైంసా

స్మారకంలో అమరులకు చోటేది?

అమరుల స్మారకం పేరుతో రూ.180 కోట్లతో సెక్రటేరియెట్​ ముందు అమరవీరుల జ్యోతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. దీన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సహా కొందరు అమరవీరుల కుటుంబ సభ్యులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అద్దాల మేడ అయిన ఈ స్మారకంలో హోటళ్లు, రెస్టారెంట్లతో టూరిస్టులను ఆకర్షించడానికే సర్కారు మొగ్గు చూపిస్తున్నది. దీన్ని ఐకానిక్​ బిల్డింగ్​లా చూపేందుకే ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందులో అమరుల ఫొటోలు, పేర్లు, ఇతర ఉద్యమ గురుతులను చాటి చెప్పేందుకు ఇచ్చిన జాగా పదో వంతు కూడా లేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర రిక్రియేషన్​కార్యక్రమాలకే ఎక్కువ స్పేస్​కేటాయించారు. సాయం దక్కని అమరవీరుల జ్ఞాపకాలకు ఇందులో అసలు చోటివ్వలేదు. రూ.80 కోట్లతో అమరవీరుల జ్యోతి నిర్మాణాన్ని ప్రారంభించగా.. ఇప్పుడు దాని ఖర్చు రూ.180 కోట్లకు చేరింది.

దూసుకొస్తున్న రైళ్లకు ఎదురేగి కొందరు.. నిలువెల్లా నిప్పు కణికలను హత్తుకొని ఇంకొందరు.. ఉరికొయ్యను ముద్దాడి మరికొందరు..  ఒక్కరా ఇద్దరా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలు, వేల మంది ఊపిరులొదిలారు. ఉద్యమం నీరుగారొద్దని, తమ మరణంతోనైనా తెలంగాణ తల్లికి విముక్తి కలగాలని చావునోట్లో తలపెట్టి అమరులయ్యారు. ఆ అమరుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ స్వరాష్ట్రంలో ఆ త్యాగధనులకు గుర్తింపు దక్కిందా? అసలు అమరుల లెక్కలన్నా సర్కారు దగ్గర ఉన్నయా? ఉంటే.. తెలంగాణ అమరవీరుల పథకం కింద ఎంత మంది కుటుంబాలకు సాయం చేసింది? ఇప్పుడు అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఎట్లున్నది?!