అనవసర ఖర్చులు తగ్గించుకొని డబ్బు జమ చేయడం ఈ రోజుల్లో చాలా ముఖ్యం. అయితే, సంపాదించిన డబ్బును ఎక్కడ పెట్టాలి అనేదే పెద్ద సమస్య. స్టాక్ మార్కెట్‌లో పెడితే నష్టాలు వస్తాయి, మరి బ్యాంకు ఎఫ్‌డిలకు (ఫిక్స్‌డ్ డిపాజిట్లు) వడ్డీ తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ వడ్డీతో పాటు డబ్బుకు భద్రత కోరుకునే వారికి, పోస్ట్ ఆఫీస్ ప్రతినెల ఆదాయ పథకం (MIS) చాలా మంచి అప్షన్. ఈ పథకంలో మీరు ఒకేసారి డబ్బు డిపాజిట్ చేస్తే, దానిపై ప్రతీ నెల ఫిక్స్డ్ వడ్డీ వస్తుంది.
ఇందుకు మీరు ఒక పెద్ద మొత్తంలో డబ్బు పోస్టాఫీసులో డిపాజిట్ చేయాలి.. దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెలా లెక్కించి, మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లో జమ చేస్తారు. అంటే, మీకు ప్రతీ నెలా ఒక హామీతో ఖచ్చితమైన ఆదాయం వస్తుందన్న మాట.
ఈ పథకం ఎవరికి : ముఖ్యంగా రిస్క్ (ప్రమాదం) లేని పెట్టుబడులను ఇష్టపడే సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడిన వారికి), పదవీ విరమణ పొందిన వారికి (పెన్షనర్లు), గృహిణులకు ఇది చాలా బాగుంటుంది. మీ పెన్షన్ డబ్బులు లేదా సేవింగ్స్ ఇందులో పెట్టి, ఖర్చుల కోసం ప్రతీ నెలా ఫిక్స్డ్ డబ్బును పొందవచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టవచ్చు: కనీసం వెయ్యితో ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యొచ్చు. ఒకరి పేరు మీద అయితే అంటే సింగిల్ అకౌంట్లో 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురి పేరు మీద అయితే అంటే జాయింట్ అకౌంట్గ అయితే 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
ఎంత ఆదాయం వస్తుంది: ప్రస్తుతం ఈ పథకంలో ఏడాదికి 7.4% వడ్డీ ఇస్తున్నారు. 9 లక్షల సింగిల్ అకౌంట్ డిపాజిట్‌పై నెలకు రూ.5,550 ఆదాయం వస్తుంది. 15 లక్షల జాయింట్ అకౌంట్ డిపాజిట్‌పై నెలకు రూ.9,250 వరకు ఆదాయం వస్తుంది.
ఈ పథకం కాలపరిమితి ఐదు సంవత్సరాలు. ఈ ఐదేళ్లు మీ అసలు డబ్బు (ప్రిన్సిపల్) లాక్ చేసి ఉంటుంది. మీకు కేవలం ప్రతినెల వడ్డీ మాత్రమే వస్తుంది. ఈ MIS పథకంలో ఎలాంటి పన్ను రాయితీలు (Tax Benefits) ఉండవు. ఇంకా ఈ పోస్టాఫీస్ పథకాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయి కాబట్టి, మీ డబ్బుకు 100% భద్రత ఉంటుంది.
అకౌంట్ ఎలా తెరవాలి: ముందుగా మీకు పోస్టాఫీసులో ఒక సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. అకౌంట్ లేకపోతే ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫొటోలు వంటి కేవైసీ (KYC) పేపర్స్ ఇచ్చి అప్లికేషన్ ఫార్మ్ తో ఓపెన్ చేయవచ్చు.
